తప్పుడు కేసులు దుర్మార్గ చర్య 

14 Sep, 2020 03:29 IST|Sakshi

ఏచూరి, ఇతర మేధావులపై పెట్టిన కేసులు ఉపసంహరించాలి: సురవరం 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రేరేపకులుగా ఆరోపిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ జయతీ ఘోష్, మరికొందరు మేధావులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరుల పేర్లు, వివరాలు పత్రికల్లో వచ్చినా వారిపై చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వారిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, ఈ తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ చేస్తున్న కుట్రను ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీమాకోరేగావ్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సంఘ్‌పరివార్‌కు చెందిన నిందితులను వదిలేసి, ఈ ఘటనతో సంబంధం లేని మేధావులు, వామపక్ష భావాలు కలిగిన వారిని తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేసి రెండేళ్లు అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయకుండా, బెయిల్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. సీపీఎం అగ్రనేత ఏచూరి, మరో 8 మంది మేధావులపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 

నేడు నిరసనలు.. 
ఢిల్లీ అల్లర్ల కేసులో ఏచూరి తదితరులపై పోలీసులు చార్జిషీటును ఫైల్‌ చేయడంపై సోమవారం సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీజేఎస్, టీటీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా హైదరాబాద్‌ ఆర్టీసి క్రాస్‌రోడ్డులో చేపడుతున్న కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు పాల్గొంటారని సీపీఎం తెలిపింది.   

మరిన్ని వార్తలు