ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !

13 Aug, 2022 15:52 IST|Sakshi
ప్రదీప్‌ మృతదేహాన్ని తీసుకొస్తున్న స్థానికులు (ఇన్‌సెట్‌) ప్రదీప్‌ (ఫైల్‌)

సుర్దేపల్లి ఏటిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు

న్యాయం కోసం ఐదు గంటల పాటు ప్రదీప్‌ కుటుంబీకుల ధర్నా    

నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్‌ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్‌ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్‌ కూడా గల్లంతైన విషయం విదితమే.

అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్‌ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్‌ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్‌ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు.
(చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్‌)

వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్‌ సీఐ ఎం.శ్రీనివాస్‌ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్‌ ఈఈ కృష్ణలాల్‌ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రదీప్‌ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్‌స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్‌ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు  చేశారు. 

తహసీల్దార్‌ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్‌.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


రోదిస్తున్న ప్రదీప్‌ భార్య బంధువులు

విలేకరిపై రాళ్లదాడి
ప్రదీప్‌ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్‌ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. 


రోదిస్తున్న నాగరాణి(కుడి) 

కుప్పకూలిన నాగరాణి
తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్‌ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ లీడర్‌ బి.ప్రదీప్‌(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్‌లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్‌తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్‌డ్యామ్‌ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

పరిహారం, ఉద్యోగం
డీఆర్‌ఎఫ్‌ టీం లీడర్‌ ప్రదీప్‌ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
(చదవండి: మాయలేడీలు.. న్యూడ్‌ వీడియోలతో వలపు వల..)

మరిన్ని వార్తలు