పాముకే విషమిచ్చి చంపేస్తే!!

28 Jun, 2021 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విషముండే పాములకే విషమిచ్చి చంపేస్తే.. దాని బాడీని ద్రవరూపంలోకి మార్చేసుకుని.. జ్యూస్‌ తాగినట్లు తాగేస్తే.. ఇవన్నీ చేస్తోంది.. మనం చాలా లైట్‌ తీసుకునే సాలె పురుగులే. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం తెలుసుకుని డంగైపోయారు. ఇదేదో ఒకట్రెండు సంఘటనలంటే మామూలుగా తీసుకోవచ్చు. వారు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశీలనలు చేసిన తర్వాత విడోస్‌ స్పైడర్‌ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను చంపేసి తినేస్తున్నాయని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్‌పర్ట్‌ మార్టిన్‌ నీఫ్‌లర్‌ జరిపిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పాములు, సాలెపురుగులు ఎదురై.. ఘర్షణ పడితే.. 87 శాతం కేసుల్లో సాలెపురుగుదే పైచేయి అయిందట. ఇలాంటివి వాళ్లు ఓ 300 ఘటనలను చూశారట. మిగిలిన వాటిల్లోనూ పాములు గెలవడం లేదట. ఎవరైనా వచ్చి వాటిని రక్షించడం ద్వారా అవి బతికిపోతున్నాయట. థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగులు ఉత్పత్తి చేసే సాలె గూళ్ల దారాలు చాలా గట్టిగా ఉంటాయని, పెద్ద పెద్ద పాములు సైతం అందులో ఇరుక్కుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

గూళ్లలో చిక్కుకోగానే అవి తమలోని విషాన్ని పాములకు ఎక్కిస్తాయి. దీంతో అవి పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి.  తర్వాత వాటి శరీరంలోని భాగాలను ద్రవ రూపంలోకి మార్చుకుని ఆ ద్రవాలను పీల్చుకు తినేస్తున్నాయని మార్టిన్‌ వివరించారు. స్పైడర్‌ ఏమో చిన్నది.. పాము కాస్త పెద్దది కదా.. దాంతో వారాలపాటు వాటికి వంటావార్పూ లాంటి పనులు ఉండవట. ఒక్కపామునే రోజులపాటు తింటూ పండుగ చేసుకుంటాయట.     – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు