భక్తజన సంద్రం.. పెద్దగట్టు

2 Mar, 2021 14:04 IST|Sakshi

భారీగా తరలివచ్చిన భక్తులు.. భక్తి శ్రద్ధలతో బోనాల సమర్పణ 

ఓ లింగా నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు

లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రులు తలసాని, జగదీశ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: పెద్దగట్టు (గొల్లగట్టు) భక్త జన సంద్రమైంది. సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో లింగమంతుల స్వామి కొలువైన ఈ గట్టుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ‘ఓ లింగా’నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె ఆలయానికి చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం బోనాల సమర్పణకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంతంకిక్కిరిసింది. మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దగట్టుకు పోటెత్తారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  

తెల్లవారు జామునుంచి బోనాల సమర్పణ.. 
తెల్లవారుజాము నుంచి మొదలైన బోనాల సమర్పణ, గంపల ప్రదక్షిణ రాత్రి పొద్దుపోయే వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. ఎండ బాగా ఉన్నా, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేయడంతో జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకున్నారు. కరోనా భయం ఉన్నా భక్తులు భారీ ఎత్తున తరలిరావడం గమనార్హం. స్వామి దర్శనం తర్వాత భక్తులు యాటపోతులను బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనమెత్తుకొని చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక మూడో రోజు మంగళవారం ప్రధాన ఆలయం ముందు పూజారులు చంద్రపట్నం వేయనున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పెద్దగట్టు పైనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.  

కనుల పండువగా జాతర
స్వరాష్ట్రంలో కనుల పండువగా పెద్దగట్టు జాతర జరుగుతోందని, ఈ జాతరకు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదవుల మీద ఉన్న అభిమానంతో ప్రభుత్వం పెద్దగట్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం జలాల ప్రభావం పెద్దగట్టు జాతరపై స్పష్టంగా కనిపిస్తోందని, జాతరకు తరలివస్తున్న రైతుల కళ్లల్లో ఆనందమే ఇందుకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. లింగమంతుల స్వామి యాదవుల ఇలవేల్పని, స్వామి కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.  ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ స్వామిని దర్శించుకున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు