పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?

5 May, 2022 09:16 IST|Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా:  బడి ఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో మధ్యలో బడిమానేసిన వారిని తిరిగి చదువు బాట పట్టించే చర్యలను విద్యాశాఖ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించింది. చదువుకు దూరమైన పాఠశాల స్థాయిలో 06–14. కళాశాల స్థాయిలో 15–19 ఏళ్ల  వారిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి ‘ప్రభంద’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. 

నేటి నుంచి ప్రారంభం
గ్రేటర్‌తో సహా శివారు రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 2,498 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో మేడ్చల్‌ జిల్లాలో 515, రంగారెడ్డి జిల్లాలో 1,301, హైదరాబాద్‌ జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో బడిమానేసిన విద్యార్థుల వివరాల జాబితా అందుబాటులో ఉంది. దీని ఆధారంగా పది, ఇంటర్, డిగ్రీ.. ఏ దశలో విద్యను మానేశారో స్పష్టంగా తేల్చనున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 12 వరకు  గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాశాఖకు చెందిన  ఐఈఆర్పీలు, సీఆర్పీలు  క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. 

ఉదయం..సాయంత్రం.. 
ఎండల తీవ్రత బడి బయట పిల్లల సర్వేపై ప్రభావం చూపనుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సులో చేర్పించనున్నారు. ఉన్నత విద్యా ఫలాలు అందించి జీవితంలో స్థిరపడేలా చేయూతనివ్వనున్నారు. సర్వే వేగవంతం చేసేలా  విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. 

పక్కాగా వివరాల సేకరణ 
చదువుకునే వయస్సులో ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడంలేదు. ఉన్నత విద్య అభ్యసించాలనే వారి ఆశయం నెరవేరడం లేదు. ఈ సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబరు, ఏ తరగతిలో బడి మానేశారు. కారణాలు ఏమిటి..? తల్లి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉందా? తల్లితండ్రుల వృత్తి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వలస కూలీల పిల్లల సమాచారాన్ని సేకరించి నమోదు చేయనున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా సర్వే మొక్కబడిగా సాగింది. ప్రస్తుతం ఆయా వివరాల సేకరణ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంటివద్దనే ఉంటూ  కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు కుల వృత్తిలో కొనసాగుతూ.. విద్యకు దూరమవుతున్నారు. 

గత సర్వేలో బడి బయట పిల్లల సంఖ్య –1226  
బడి బయట పిల్లల వివరాలకు సంబంధించి 2020–21లో విద్యాశాఖ సర్వే నిర్వహించగా ,గ్రేటర్‌తో సహా శివారు జిల్లాల్లో 1226 మంది లెక్క తేల్చారు. ఇందులో మేడ్చల్‌ జిల్లాలో 294 , రంగారెడ్డి జిల్లాలో 413, హైదరాబాద్‌ జిల్లాలో 519 మంది ఉండగా,  వీరందరికీ ఆయా పాఠశాలలు, సార్వత్రిక విద్యాలయాల్లో ప్రవేశాలు     కల్పించి చదువుకునేలా విద్యాశాఖ  చర్యలు  తీసుకుంది.   

(చదవండి: జల్లు..ఝల్లు)

మరిన్ని వార్తలు