Hyderabad: షాకింగ్‌ విషయాలు.. ‘సోషల్‌’ శృతి మించితే అంతే.. రోజుకు 6 గంటలా!

6 Dec, 2022 19:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కౌమార ప్రాయంలోనే కుర్రకారు సోషల్‌ మీడియాలో గంటల తరబడి గడిపేస్తున్నారు. చదువు, కెరీర్, భవిష్యత్‌కు చక్కటి బాటలుపర్చుకోవాల్సిన తరుణంలోనే సామాజిక మాధ్యమాలతో కుస్తీ పడుతూ సమయం వృథా చేసేస్తున్నారట. మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్‌ అత్యధికంగా ఉన్నట్లు టెక్‌సెవీ అనే సంస్థ తాజా అధ్యయనంలో తెలిపింది. మన  సుమారు 31 శాతం మంది టీనేజర్స్‌ రోజుకు 6 గంటల పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సాప్‌ తదితర మాధ్యమాలతో పాటు ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌లతో టైమ్‌పాస్‌ చేస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 

రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సోషల్‌ మీడియా, గేమ్స్‌ ఆడుతూ గడుపుతున్నవారు 27 శాతం మంది.. ఒకటి నుంచి మూడు గంటల పాటు గడుపుతున్న వారు 8 శాతం.. కేవలం ఒక గంటపాటైనా సోషల్‌ ఛాట్, వీడియో గేమ్‌ ఆడనిదే నిద్రపోని వారు 13 శాతం మంది ఉండడం గమనార్హం. నయాట్రెండ్‌ మాటెలా ఉన్నా.. ఈ పరిణామంతో తమ పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 9 నుంచి 13 ఏళ్లలోపు వారిలోనూ 21 శాతం మంది రోజుకు 6 గంటల పాటు సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్‌తో కుస్తీ పడుతున్నట్లు ఈ అధ్యయనం తెలపడం గమనార్హం. 

తమ చిన్నారులు వీడియో గేమ్‌లు, సోషల్‌ మీడియాకు బానిసలుగా మారినట్లు 39 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తుండగా.. మరో 38 శాతం మంది ఈ పరిణామం పట్ల ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిపింది. మరో 23 శాతం మంది చిన్నారులు సోషల్‌ మీడియా, గేమ్స్, వీడియోలకు బానిసలుగా మారలేదని స్పష్టం చేసినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 

శృతి మించితే అనర్థాలే..  
ప్రస్తుత సాంకేతిక యుగంలో చిన్నారులకు అన్ని మాధ్యమాలపై అవగాహన తప్పనిసరి అయినప్పటికీ.. ఇదే వ్యసనంగా మారితే అనర్థాలు తప్పవని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు ఏ అంశాలపై సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేస్తున్నారు? ఎలాంటి చాటింగ్‌ చేస్తున్నారు? ఏ గేమ్స్‌ ఆడుతున్నారన్న అంశంపై తల్లిదండ్రులు కనిపెట్టని పక్షంలో అనర్థాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. 

స్మార్ట్‌ ఫోనే ముద్దు.. 
చాక్లెట్‌.. పిజ్జా.. బర్గర్‌లతో పాటే టీనేజర్లు స్మార్ట్‌ ఫోన్‌ను బాగా ముద్దు చేస్తున్నారట. సుమారు 38 శాతం మంది కౌమార దశ బాల, బాలికలు విరివిగా స్మార్ట్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్లను 31 శాతం మంది.. ల్యాప్‌టాప్‌లను 16 శాతం.. ట్యాబ్లెట్‌ పీసీలను 5 శాతం మంది వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం తెలపడం విశేషం.

మరిన్ని వార్తలు