మల్కన్‌గిరి–భద్రాచలం కొత్త రైల్వే లైన్‌

23 Apr, 2022 03:38 IST|Sakshi

173 కిలోమీటర్ల నిడివి .. రూ.2,800 కోట్ల వ్యయం 

రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల అనుసంధానం 

మొత్తం 213 వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు 

గత సెప్టెంబర్‌లోనే పచ్చజెండా ఊపిన రైల్వే బోర్డు 

 జూన్‌ నాటికి ఎఫ్‌ఎల్‌ సర్వే పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కాబోతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్‌ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్‌ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్‌లో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్‌ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు.  

తెలంగాణలోకి ఇలా.. 
ఒడిశాలోని జేపూర్‌ నుంచి మల్కన్‌గిరికి గతంలో రైల్వే లైన్‌ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్‌ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానించనున్నారు.  

ప్రస్తుతానికి ప్రయాణికుల కోసమే.. 
రైల్వే కొంతకాలంగా సరుకు రవాణాకు బాగా ప్రాధాన్యం ఇస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రత్యేకంగా సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కేవలం బొగ్గు తరలింపును దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే మల్కన్‌గిరి–భద్రాచలం మార్గాన్ని ప్రస్తుతానికి ప్రయాణికుల రైళ్ల కోసమే అని పేర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో దీన్ని సరుకు రవాణాకు కూడా వినియోగించే అవకాశం ఉంది. 

సర్వే వేగవంతం చేయండి: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం మల్కన్‌గిరి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు ఆయనకు మల్కన్‌గిరి–భద్రాచలం లైన్‌ పురోగతిని మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తలైన్‌ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా సర్వేలో వేగం పెంచాలని మంత్రి సూచించారు.   

మరిన్ని వార్తలు