జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు

16 Dec, 2020 11:41 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర  సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను  కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్‌ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో  సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం

తగ్గిన సిజేరియన్లు.. 
జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్‌ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్‌ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో  43.2 శాతానికి తగ్గింది. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్‌
ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. 

తగ్గని మధుమేహం..
జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్‌) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది.  141–160 ఎంజీ/డీఎల్‌ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 

మరింత పెరిగే అవకాశం..
ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్‌పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్‌ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్‌లు చేయడంలేదు. ఐసీడీఎస్‌ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది.  
– పద్మావతి, ఐసీడీఎస్‌ పీడీ 

జిల్లా వివరాలు       2015–16(శాతం)  2019–20(శాతం) 
 
ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2
15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా    26.1 24.1
మహిళల్లో అక్షరాస్యత 57 63.6 
20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3  30.6 

                                   

మరిన్ని వార్తలు