‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం!

17 Sep, 2022 03:41 IST|Sakshi

విద్యార్థులతోనూ నినాదాలు చేయించి మంత్రి జగదీశ్‌రెడ్డిని

బాహుబలిగా పొగిడిన సూర్యాపేట జిల్లా ఎస్పీ

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్‌రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: బాబాసాహెబ్‌ కలల సాకారంలో...

మరిన్ని వార్తలు