గ్యాలరీ స్టాండ్‌ ఘటన: మురారి వెన్నెముకకు తీవ్ర గాయాలు

24 Mar, 2021 08:13 IST|Sakshi

16 మందికి సర్జరీలు.. 42 మందికి తీవ్ర గాయాలు.. 

చికిత్సపై ప్రత్యేక దృష్టి 

హైదరాబాద్‌ నిమ్స్, పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలింపు 

సాక్షి, సూర్యాపేట: జాతీయస్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిలో 30 మందికి, ఇతర, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో 70 మందికి వైద్యం అందిస్తున్నారు. జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న 30మంది క్షతగాత్రుల్లోని 16మందికి వివిధ శస్త్రచికిత్సలు చేశామని, మిగతా వారినీ పరీక్షించి అవసరమైన శస్త్రచికిత్సలు చేయనున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మురళిధర్‌రెడ్డి తెలిపారు. 

ఎనిమిది మందికి సీరియస్‌? 
సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్యాలరీ కుప్పకూలి 150 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. ఇందులో తీవ్ర గాయాలపాలైన 42 మందిని సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, నార్కట్‌పల్లి కామినేని, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కామినేని ఆస్పత్రిలో సూర్యాపేటకు చెందిన నరేష్‌ (30), మురారి (45)లకు చికిత్స అందిస్తున్నామని.. వీరిలో మురారికి వెన్నెముకపై బలమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అన్ని పరీక్షలు చేశామని, వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

మంచి చికిత్స అందిస్తాం: జగదీశ్‌రెడ్డి 
ప్రమాద బాధితులకు జరుగుతున్న చికిత్సపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఆయా ఆస్పత్రుల వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు ఎటువంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వారు ఇళ్లకు క్షేమంగా చేరేంత వరకు సహాయ సహకారాలు అందించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సూచించారు. 

నిర్వాహకులు, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు 
గ్యాలరీ ప్రమాదంపై బాధితుల కుటుంబ సభ్యులు సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కబడ్డీ పోటీల నిర్వాహకులు, గ్యాలరీ నిర్మాణ కాంట్రాక్టర్‌పై 336, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఉత్సాహంగా కొనసాగిన పోటీలు 
సూర్యాపేటలో రెండో రోజు మంగళవారం 47వ జాతీయ స్థాయి బాలబాలికల జూనియర్‌ కబడ్డీ పోటీలు కోలాహలంగా సాగాయి. మొదటి రోజు సోమవారం రాత్రి గ్యాలరీ ప్రమాదం అనంతరం పోటీలు ఆలస్యంగా ప్రారంభంకాగా, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   

చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్‌ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు