‘బండి సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి జరగలేదు’

18 Mar, 2021 14:31 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సూర్యపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌

సోషల్‌ మీడియాలో వస్తున్నదంతా అబద్ధం

పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి

సూర్యాపేటక్రైం : కోదాడలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై ఎలాంటి దాడి జరగలేదని కేవలం కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్‌ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో పార్టీ కార్యక్రమానికి బండి సంజయ్‌ హాజరవుతున్నారనే సమాచారం పోలీసులకు ముందుగానే ఉందన్నారు. అందుకోసం ముందస్తుగా హుజూర్‌నగర్‌లో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 

హుజూర్‌నగర్‌లో కార్యక్రమం ముగిసిన అనంతరం కోదాడకు వచ్చి అక్కడ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్‌ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులు వెంటనే స్పందించి కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకుని కాన్వాయ్‌ను పోలీసు రక్షణ మధ్య హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌కు పంపించామన్నారు. ఈ సంఘటనలో ఆందోళనకారులు ఇనుప రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని సోషల్‌ మీడియాలో వస్తున్నదంతా అబద్ధమన్నారు. ఈ సంఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి వాహనం ధ్వంసం కాలేదని అది గతంలో జరిగిన సంఘటనలో ధ్వంసమైందన్నారు. 

ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయగా చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సంఘట­నలో ఎవరు పాల్గొన్నారో వీడియో ఫుటేజి ఆధారం­గా పరిశీలించి వారిపై కేసు నమోదు చేస్తామన్నా­రు. సంజయ్‌ పర్యటనలో ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. సమావేశంలో  డీఎస్పీ రఘు,  ఇన్‌స్పెక్టర్లు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

చదవండి: బండి సంజయ్‌ మూల్యం చెల్లించక తప్పదు..

మరిన్ని వార్తలు