పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి

15 Jun, 2022 14:11 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం ప్రయాణ సమయంలో గంట ఆదా

సెప్టెంబరు చివరి నాటికి పూర్తి.. ఆ వెంటనే జాతికి అంకితం

సాక్షి,హైదరాబాద్‌: సూర్యాపేట–ఖమ్మం మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సెప్టెంబరు చివరికల్లా రోడ్డు పనులు పూర్తికానుండటంతో వెంటనే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్‌–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గిపోనుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరుసల రోడ్డు అందుబాటులో ఉండగా, సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య ఇంతకాలం రెండు వరుసల రోడ్డే ఉండేది.  


రోడ్డు కూడా బాగా దెబ్బతినిపోవడంతో ప్రయాణ సమయం బాగా పెరుగుతూ, తరచూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో దీన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించిన కేంద్రం 2019లో ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్‌ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో మూడు నెలల అదనపు సమయాన్ని నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఫలితంగా సెప్టెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 58.63 కిలోమీటర్లకు ఇప్పటికే 49.55 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. (క్లిక్‌: బ్లాక్‌ ఫిల్మ్‌లు, నంబర్‌ ప్లేట్లపై నజర్‌.. స్పెషల్‌ డ్రైవ్‌)

మరిన్ని వార్తలు