రేవంత్‌ చిచ్చు ఎపిసోడ్‌: హస్తవ్యస్తం.. గందర గోళం, కొనసాగుతున్న సస్పెన్స్‌

4 Jan, 2023 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. కీలకమైన అంశాలపై బుధవారం పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగే సమావేశానికి సీనియర్ల హాజరుపై అస్పష్టత నెలకొంది. ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్‌సే హాత్‌జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రేవంత్‌రెడ్డి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఆయన పాల్గొనే కార్యక్రమాలకు హాజరు కాకూడదని పలువురు సీనియర్లు నిర్ణయించుకోవడం, ఏఐసీసీ బుజ్జగింపుల నేపథ్యంలో బుధవారం నాటి సమావేశానికి ఎవరు వెళతారనే చర్చ జరుగుతోంది. 

ఏఐసీసీ నుంచి కబురు
రేవంత్‌రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు సీనియర్లు విభేదించిన నేపథ్యంలో ఏఐసీసీ పక్షాన సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న ఆయన ఢిల్లీ వెళ్లి కూడా పది రోజులు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఏఐసీసీ నుంచి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్య తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ పరిస్థితుల్లోనే రేవంత్‌ ఐడియాలజీ సెంటర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), పార్టీ కార్యవర్గం (పీఈసీ), అనుబంధ సంఘాల చైర్మన్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి సీనియర్‌ నేతలు కూడా హాజరు కావాలని ఏఐసీసీ కార్యాలయం నుంచి పలువురికి ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది.

హాత్‌సే హాత్‌ జోడో యాత్రలపై చర్చ జరగనున్నందున ఈ సమావేశంలో పాలుపంచుకోవాలని కోరినట్టు సమాచారం. అయితే సీనియర్లు ఇప్పటికీ మెత్తబడలేదని తెలుస్తోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఢిల్లీలో జరిగే పార్ల మెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈ సమావేశానికి వచ్చే అవకాశం లేదని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. సీఎల్పీనేత భట్టితో పాటు ఇతర సీనియర్లు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.  

నాకు సమాచారం లేదు: ఏలేటి
బుధవారం జరిగే టీపీసీసీ సమావేశం గురించి తనకు సమాచారం లేదని ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి చెప్పారు. రేపటి కార్యక్రమం ఏఐసీసీ కార్యక్రమం కాదని వ్యాఖ్యానించారు. హాత్‌సే హాత్‌జోడో యాత్రల గురించి మాత్రం ఏఐసీసీ నుంచి సర్క్యులర్‌ వచ్చిందని తెలిపారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..హాత్‌సే హాత్‌జోడో యాత్రలో భాగంగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని, ఈ యాత్రల తర్వాత రాష్ట్ర రాజధానిలో జాతీయ, రాష్ట్ర నేతలు పాదయాత్ర చేస్తారని తెలిపారు. దీనికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. రేవంత్‌ పాదయాత్ర గురించి తనకు తెలియదన్నారు. ఆయన యాత్రకు ఏఐసీసీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏలేటి వ్యాఖ్యలను బట్టి చూస్తే సీనియర్లు బుధవారం నాటి సమావేశానికి వెళ్లబోరని అర్ధమవుతోందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు