వైద్య విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

13 Sep, 2023 01:26 IST|Sakshi

గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయం ముట్టడి

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్‌ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్‌ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్‌ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు.

యాంటీ ర్యాగింగ్‌ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్‌ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్‌ రమేశ్‌రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్‌ ప్రిన్సిపాల్‌ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు