సర్పంచ్‌లకు సస్పెన్షన్‌ టెన్షన్‌!

22 Jul, 2021 04:36 IST|Sakshi

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో దినదిన గండంలా పదవి 

చిన్న చిన్న వాటికే సస్పెండ్‌ చేస్తున్నారని ఆరోపణలు 

చట్టం వచ్చిన నాటి నుంచి 2020 మే వరకు 139 మంది సస్పెన్షన్‌ 

సాక్షి, వరంగల్‌ రూరల్‌: గ్రామ సర్పంచ్‌లకు ‘సస్పెన్షన్‌’టెన్షన్‌ పట్టుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం 2018–37(5) చట్టం ప్రకారం విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సర్పంచ్‌లను సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడంతో వారు దినదినగండంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, హరితహారం, పల్లెప్రకృతివనం పనుల్లో జాప్యం జరిగినా సస్పెండ్‌ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలానా సమస్య పరిష్కరించుకుండా సర్పంచ్‌ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఫిర్యాదు చేసినా సరే వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామాలుంటే 2,145 మంది సర్పంచ్‌లకు ఆయా జిల్లా కలెక్టర్లు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వరంగల్‌ రూరల్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఇద్దరు.. మొత్తం ఐదుగురిని విధుల నుంచి తొలగించారు. ఇలా 2021 మే వరకు రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సర్పంచ్‌లు సస్పెండయ్యారు.  

ప్రత్యర్థి పార్టీ వారిపై.. 
► వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామం సర్పంచ్‌ శ్రీధర్‌ది కాంగ్రెస్‌ పార్టీ. అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ నేతలు ఊరిలో పారిశుధ్యం లోపించిందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 2020 సెప్టెంబర్‌ 26న సస్పెండ్‌ చేశారు. అయితే ఇందుకు తగిన చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి తిరిగి అక్టోబర్‌ 9న విధుల్లో చేరారు. 
► నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ సర్పంచ్‌ శారద కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. ఆమెపై గతేడాది నవంబర్‌ 3న సస్పెన్షన్‌ వేటుపడింది. నిధులు దుర్వినియోగం చేశారని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేశారంటూ అధికార పార్టీకి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లు ఆమెపై ఫిర్యాదు చేయగా, కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఆమె కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తే వారం తర్వాత సస్పెన్షన్‌ ఎత్తేశారు. 

ఆధిపత్య పోరు.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన అనంతరం అధికారులు సస్పెండ్‌ చేశారు. అధికార పార్టీ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వర్గం కావడంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఆమెను సస్పెండ్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ దుమారం చెలరేగడంతో రెండు నెలల తర్వాత ఆమెపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు.  

ఏ జిల్లాలో ఎందరు సస్పెండయ్యారంటే.. 
వరంగల్‌ రూరల్‌ 10, వరంగల్‌ అర్బన్‌ 8, ములుగు 3, జనగాం 3, మహబూబాబాద్‌ 2, కరీంనగర్‌ ఒకటి, జగిత్యాల 7, మంచిర్యాల 7, ఖమ్మం 9, భద్రాద్రి కొత్తగూడెం 4, నిజామాబాద్‌ 4, కామారెడ్డి 11, మెదక్‌ 5, సంగారెడ్డి 8, రాజన్న సిరిసిల్లా 2, జోగుళాంబ గద్వాల 5, నాగర్‌ కర్నూలు 6, వనపర్తి 2, నల్లగొండ 12, సూర్యాపేట 1, ఆదిలాబాద్‌ ఒకటి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 1, రంగారెడ్డి 19, వికారాబాద్‌ 1, యాదాద్రి భువనగిరి 7. 

కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నా కూడా.. 
కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌ గ్రామ సర్పంచ్‌ చిలుక లింగయ్య వైకుంఠ ధామం నిర్మాణపనులు చేయకపోవడంతో తొలుత షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. సమాధానం సంతృప్తికరంగా లేదని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. చిలుక లింగయ్య హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా ఇంకా అధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఉప సర్పంచ్‌ చిరంజీవి సర్పంచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన చిలుక లింగయ్య మండలంలో బీజేపీకి చెందిన సర్పంచ్‌ కావడం గమనార్హం. 

సబ్‌స్టేషన్‌ కోసం స్థలం అడిగితే సస్పెండ్‌ చేస్తారా? 
మా గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ కోసం స్థలం కేటాయించలేదని నాలుగో విడత పల్లెప్రగతి తొలిరోజు గ్రామసభను పాలకవర్గమంతా బహిష్కరించాం. దీంతో పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 2021 జూలై 15న కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే ఊరి బాగు కోసం నేను ఈ విషయాన్ని లేవనెత్తితే సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమో కలెక్టర్‌ ఆలోచించుకోవాలి.         
- ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్‌ పెద్దకోడెపాక, వరంగల్‌ రూరల్‌ జిల్లా 

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి
చాలా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో చిన్నచిన్న కారణాలకే ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పంచాయతీ నిధుల దుర్వినియోగం, స్వ లాభానికి అధికార దుర్వినియోగం వంటి వాటికే సస్పెండ్‌ చేసే చేసేలా చట్టాన్ని సవరణ చేయాలి. ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ ఫీజు రూ.25 వేల నుంచి రూ.100కి తగ్గించాలి. ఈ చట్ట సవరణ జరిగే వరకు చిన్న చిన్న కారణాలతో సర్పంచ్‌లను సస్పెండ్‌ చేయవద్దని సంబంధిత అధికారులకు తెలపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు గ్రామ సభను బహిష్కరించిన పెద్దకొడెపాక గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయడం సరికాదు. ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం కూడా ఇచ్చాం. 
– ఎం.పద్మనాభరెడ్డి, ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి  

మరిన్ని వార్తలు