నాగరాజుది హత్యే..

18 Oct, 2020 02:10 IST|Sakshi
నాగరాజు (ఫైల్‌)

ఎవరో కావాలనే కుట్రపన్నారు

ఏసీబీ తప్పుడు కేసు పెట్టింది

సీబీఐ విచారణ కోసం పోరాడుతాం

మీడియాతో మాజీ తహసీల్దార్‌ భార్య, బావమరిది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో బయటికి వస్తానని, లాయర్లతో మాట్లాడాలని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య స్వప్న, బావమరిది శేఖర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య పలు సంచల న ఆరోపణలు చేశారు. ఆయన చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు రూ. కోటి పది లక్షల లంచం కేసు తప్పుడుదని.. ఆయన్ను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను, పిల్లలంటే ప్రాణమిచ్చే వ్యక్తి తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించారు.

ఈ విషయంలో జైలు అధికారులు, పోలీసులు, ఏసీబీ మీద తమకు న మ్మకం లేదన్నారు. ఆయన మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐ విచారణ జరగాల్సిందేనని స్వప్న డిమాండ్‌ చేశారు. దాడులు జరిగిన ఆగస్టు 14 రాత్రి ఏసీబీ అధికారులే నగదు బ్యాగుల్లో తీసుకువచ్చారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని నాగరాజు చెప్పారన్నారు. అసలు టర్కీ టవల్‌తో ఉరివేసుకోవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆ సమయం లో నాగరాజుతోపాటు ఉన్నవారంతా ఎందు కు లేవలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం 3.30 గంటలకు నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే.. 6 గంటలు దాటాక తమ కు సమాచారం ఇచ్చారని వాపోయారు. 

అది ముమ్మాటికీ తప్పుడు కేసు..
రూ.కోటి పది లక్షల కేసు తప్పుడుకేసని నాగరాజు బావమరిది శేఖర్‌ ఆరోపించారు. ఆ మొత్తం ఏసీబీ వాళ్లే తీసుకువచ్చారని ధ్వజమెత్తాడు. ఈ మేరకు తమ వద్ద సీసీ టీవీ ఫుటేజీ ఉందని, వాటిని హైకోర్టుకు అందజేస్తామన్నారు. అసలు రూ.కోటి పదిలక్షల కేసు నిలవదని తెలిసాకే, నాగరాజును ఇరికించేందుకు నకిలీ పాసు పుస్తకాల కేసు పెట్టారని తెలిపారు. 

ఆత్మహత్యకు ముందురోజు వీడియో కాల్‌
నకిలీ పాసు పుస్తకాల జారీ కేసులో కందాడి ధర్మారెడ్డితోపాటు నాగరాజు మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈ నెల 13, 14 తేదీల్లో నాగరాజును ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీకి ఒక్కరోజు ముందు.. అంటే ఈ నెల 12న కుటుంబ సభ్యులతో నాగరాజు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ కాల్‌ రికార్డును కూడా కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఏముందంటే.. తాను అన్ని పత్రాలు పరిశీలించాకే ముందుకు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పడం కనిపించింది. భయపడాల్సిన పనిలేదని, బెయిల్‌ వస్తుందని న్యాయస్థానంలో పోరాటం చేద్దామని నాగరాజుకు శేఖర్‌ ధైర్యం చెప్పడం వీడియోలో కనిపించింది.  

మరిన్ని వార్తలు