అక్టోబర్‌ 1న ఢిల్లీలో జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో ప్రదానం

25 Sep, 2022 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్‌–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది.

పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, లిట్టర్‌ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్‌ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు.

ఢిల్లీలో అక్టోబర్‌ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్‌+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను  ఓడీఎఫ్‌++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్‌+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్‌ పట్టణాలుగా ప్రకటించారు.  

అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. 
ఆదిభట్ల, బడంగ్‌పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్‌కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ.  

­సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు: మంత్రి కేటీఆర్‌ 
ఈ ఏడాది కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ఎంపిక కావడంపట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతినెలా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రాథమిక సేవలకు వీలు కలిగిందన్నారు. ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్‌ 
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నా రు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2022 అవార్డుల్లో తెలంగాణలోని 16 పట్టణాలు అవార్డులు గెలుచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి దర్పణంగా నిలిచిందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద తెలంగాణ పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్‌ కవర్‌ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్‌ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశా నికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు