అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం

14 May, 2021 16:56 IST|Sakshi

కరోనా కట్టడికి అపార్ట్‌మెంట్స్, ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన

స్వామి వివేకానంద సొసైటీ కృషితో ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం

స్థానిక కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి సహకారంతో మరింత ముందుకు

హైదరాబాద్‌: విభిన్న వర్గాల ప్రజల సమైక్య జీవనం సాగించే ప్రాంతం అది. ఐక్యతతో ఒకే కుటుంబంలా ఉంటారు వారంత. ఎలాంటి ఉపద్రవం సంభవించినా వారంతా సమష్టిగా స్పందిస్తారు. అదే రహమత్‌నగర్‌ డివిజన్‌లోని ‘స్వామి వివేకానంద వెల్ఫేర్‌ సొసైటీ’. రహమత్‌నగర్‌ డివిజన్‌లోనే ఆదర్శంగా నిలిచింది ఈ సొసైటీ. తాజాగా కరోనా మహమ్మారిని నివారించడానికి సంఘం పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, నిర్ణయాలను సొసైటీ సెక్రటరీ సర్దార్‌ గురుదీప్‌ సింగ్‌ వివరించారు. ∙రహమత్‌నగర్‌లోని స్వామి వివేకానంద వెల్ఫేర్‌ సొసైటీలో 60కి పైగా అపార్ట్‌మెంట్స్, 20 ఇండిపెండెంట్‌ ఇళ్లు ఉన్నాయి. సుమారు 5 వేల జనాభా వరకు ఉంటుంది. 

∙స్థానిక కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి కార్యాలయం కూడా ఇదే సొసైటీలో ఉంది. అయితే నిత్యం కాలనీలో కార్పొరేటర్‌ ఏర్పాటు చేసిన శానిటేషన్‌ వాహనం ద్వారా శానిటైజ్‌ చేస్తుంటారు. 
∙కాలనీలో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తుంటారు. 
∙గత లాక్‌డౌన్, ప్రస్తుత కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లోనే ఈ కాలనీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
∙కోవిడ్‌ తీవ్రతపై కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రతివారం 
సమీక్షిస్తుంటారు. 
∙మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలని, ప్రతి అపార్ట్‌మెంట్‌లో మాస్క్‌లు లేకుండా ఎవరినీ రానివ్వొద్దని, శానిటైజర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 
∙తరుచూ ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 
∙పండ్ల రసాలు, తాజా కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవాలని, కొన్ని రోజులు బయటి ఆహారం వాడరాదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. 
∙కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అసోసియేషన్‌ తీవ్రంగా కృషి చేస్తుంది. 
∙మనం తీసుకునే జాగ్రత్తలు, చర్యల వల్లే కరోనాను నియంత్రించగలమని, సొసైటీని కరోనా రహితంగా చేయడానికి సంఘం ప్రతిని«ధులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. 

కోవిడ్‌ రహిత సొసైటీకి కృషి 
కోవిడ్‌ నియంత్రణకు సొ సైటీ ప్రతినిధులతో సమీక్షిస్తున్నాం. స్వీయ రక్షణ పాటించాలని స్థానికులను పదేపదే కోరుతున్నాం. లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. చిన్నపాటి జాగ్రత్తలతో కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టొచ్చు. ప్రతిఒక్కరినీ అప్రమత్తం చేస్తున్నాం. భయం వీడి కోవిడ్‌ రహిత సొసైటీగా చేసే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నాం. 
– సర్దార్‌ గురుదీప్‌ సింగ్, సొసైటీ సెక్రటరీ

మరిన్ని వార్తలు