స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్ని ప్రమాదం.. ఆదుకుంటున్న ఆడబిడ్డ ఆవిరైంది..

18 Mar, 2023 05:01 IST|Sakshi

నేలకొండపల్లి: స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నింపిన మరో విషాదమిది.. కూలీనాలీ చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను చదివించిన ఆ కుటుంబానికి కొడుకులా అండగా నిలుస్తున్న త్రివేణి మంటల్లో కాలిపోయింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుంచం రామారావు, వ్యవసాయ కూలీ రమణ దంపతులు. వీరికి త్రివేణి (22), మమత కుమార్తెలు. ఉన్నంతలో కుమార్తెలిద్దరినీ బాగా చదివించారు.

త్రివేణి బీటెక్‌ పూర్తి చేశాక హైదరాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని ఓ కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం సాధించింది. అదే కార్యాలయంలో ఆమె చెల్లెలు మమత కూడా ఉద్యోగం చేస్తోంది. గురువారం సాయంత్రం పని నిమిత్తం మమత కింది ఫ్లోర్‌కు రాగా.. అక్క వచ్చాక ఇద్దరూ వారుంటున్న రూమ్‌కి వెళ్లాలనుకున్నారు. ఇంతలోనే మంటలు వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక మమత రోదిస్తూ అక్క త్రివేణికి ఫోన్‌ చేయగా తీయలేదు. చివరకు మంటలు, పొగలో చిక్కుకుని త్రివేణి కన్నుమూసినట్లు తెలియడంతో తల్లిదండ్రులకు చెప్పింది. మృతదేహాన్ని సుర్దేపల్లికి శుక్రవారం తీసుకొచ్చి కన్నీళ్ల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు