ఘనంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు

12 Aug, 2022 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ ఉత్సవాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మువ్వన్నెల రంగులు అలరిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రభుత్వం స్వయంగా చేపట్టింది. 552 సినిమా థియేటర్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ప్రతి ఇంటి మీద మువ్వన్నెల జెండా ఎగురవేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో జాతీయ జెండాల వితరణ కార్యక్రమం సాగుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండాలను అందజేస్తున్నారు.

రాష్ట్రంలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫ్రీడం రన్, బుక్‌ ఫెయిర్, ఫొటో ఎగ్జిబిషన్‌ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ తెలిపింది. ఝాన్సీ లక్ష్మీబాయి, జాతి పిత మహాత్మా గాంధీ, బాలగంగాధర్‌ తిలక్, సుభాష్‌ చంద్రబోస్, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, డా.బి.ఆర్‌.అంబేడ్కర్, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, భగత్‌సింగ్‌తోపాటు పలువురు సమర యోధుల జీవిత చరిత్రలు తెలిపే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.     

మరిన్ని వార్తలు