చిన్నారి ఎలెన్‌కు భరోసా

7 Aug, 2022 02:16 IST|Sakshi
ఎలెన్‌తో తల్లిదండ్రులు, ఇంజెక్షన్‌ జోల్జెన్‌స్మా  

రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ ఉచితంగా 

స్విట్జర్లాండ్‌కు చెందిన ‘నోవార్టిస్‌’ సంస్థ ఔదార్యం 

దుమ్ముగూడెం: బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసిపాప జన్యుపరమైన వ్యాధి బారిన పడి రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. చికిత్సకు అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ‘నోవార్టిస్‌’ ఉచితంగా అందజేయడంతో తల్లి­దం­డ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్‌ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు.

వీరి పాప ఎలెన్‌కు రెండేళ్లు. మెడ భాగం దృఢంగా లేకపోవడంతో కిందకు వాలిపోతుండటాన్ని పాప నాలుగు నెలల వయసున్నప్పుడే తల్లిదండ్రులు గమనించారు. వయసు పెరుగుతున్నా పాప శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమస్య ఏమిటో తేలలేదు. ఆ తర్వాత చెన్నైలోని వేలూరు మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఎలెన్‌ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, సత్వరమే వైద్యం చేయించాలని సూచించారు.

పాపను రక్షించుకోవాలంటే రూ.16కోట్ల విలువైన జోల్జెన్‌స్మా ఇంజెక్షన్‌ చేయించాలని చెప్పారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలైన ప్రవీణ్‌–స్టెల్లా కుప్పకూలి పోయారు. ఈ విషయమై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, చానళ్లలో కథనాలు రాగా, విషయం స్విట్జర్లాండ్‌లోని నోవార్టిస్‌ సంస్థ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు సంస్థ యాక్సెస్‌ ప్రోగ్రాంలో భాగంగా జూలై నెలలో ఎలెన్‌కు ఉచితంగా ఇంజె క్షన్‌ ఇచ్చేందుకు ఎంపిక చేసింది.

నిర్ణయించిన ప్రకారం.. ఎలెన్‌కు శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో ఇంజెక్షన్‌ వేశారు. పాప ప్రాణానికి ఇబ్బంది లేదని,  ఇకనుంచి కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పినట్లు ప్రవీణ్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, పాపకు నయం కావాలని ప్రార్థనలు చేసిన వారితోపాటు కథనాలు రాసిన మీడియాకూ ప్రవీణ్‌ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు