స్వదేశీ హైస్పీడ్‌ డ్రోన్‌ 

15 Oct, 2021 02:52 IST|Sakshi

‘ఏఎంఆర్‌టీ25’ డ్రోన్‌ను రూపొందించిన ‘టీవర్క్స్‌’

సాక్షి, హైదరాబాద్‌: స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వినూత్నమైన డ్రోన్‌.. ‘ఎయిర్‌బార్న్‌ మెడికల్‌ రాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌–25 (ఏఎంఆర్‌టీ25)’ను విజయవంతంగా పరీక్షించిన ట్టు టీవర్క్స్‌ గురువారం ప్రకటించింది. ఈ డ్రోన్‌ నిలువుగా పైకి ఎగిరి, వేగంగా ప్రయాణించి, మళ్లీ నిలువుగా (వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌– వీటీఓఎల్‌) కిందికి దిగుతుందని వెల్లడించింది. దేశంలో ఇలాంటి హైబ్రిడ్‌ డ్రోన్లను రూపొందించి, తయారు చేసి, పరీక్షించగలిగే అతికొద్ది సంస్థల జాబితాలో ‘టీవర్క్స్‌’ కూడా చేరినట్టు తెలిపింది. ఈ డ్రోన్‌లో ప్రధాన ఫ్రేమ్‌తోపాటు ఇతర విడిభాగాలన్నింటినీ టీవర్క్స్‌లోనే తయారుచేశామని వివరించింది. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న తమ కేంద్రంలో సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ టూల్స్, 3డీ ప్రింటింగ్, లేజర్‌ కట్టింగ్, కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (సీఎన్‌సీ) రూటర్‌ పరికరాలు ఉన్నాయని.. వాటి సాయంతో విడిభాగాలను రూపొందించామని పేర్కొంది. 

30 సార్లు విజయవంతంగా..:ఏఎంఆర్‌టీ25ని ఇప్పటివరకు 30 సార్లు విజయవంతంగా పరీక్షించామని.. గరిష్ట దూరం, సామర్థ్యం, నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవడం, ప్రయోగించిన చోటికి తిరిగి రావడం వంటి అంశాల్లో సంతృప్తికరమైన ఫలితాలు సాధించిందని టీవర్క్స్‌ వెల్లడించింది. ఈ డ్రోన్‌ 33 నిమిషాల వ్యవధిలో 45 కిలోమీటర్ల దూరం ప్ర యాణించి, సురక్షితంగా ల్యాండ్‌ అయిందని వివరించింది. ఈ దూరాన్ని, బరువు మోసుకెళ్లే సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. తాము రూపొందించిన డ్రోన్‌.. సాధారణ డ్రోన్లతో పోలిస్తే కేవలం పావు వంతు ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించుకుంటుందని, ఎక్కువ బరువును, ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించింది. రకరకాల డ్రోన్లను తయారు చేసేందుకు అవసరమైన విడిభాగాలను ఇప్పటికే తమ ‘ప్రోటో టీవర్క్స్‌’ విభాగం ద్వారా అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. 

‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ స్ఫూర్తితో.. :కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఉమ్మడిగా ‘మెడిసిన్‌ ఫ్రం స్కై’ కార్యక్రమాన్ని ప్రకటించాయి. డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జూన్‌లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వేగంగా, సురక్షితంగా, అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసే డ్రోన్ల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న టీవర్క్స్‌.. అడవులు, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లగలిగే డ్రోన్ల రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఎక్కడైనా టేకాఫ్‌/ల్యాండింగ్‌ అయ్యేలా హెలికాప్టర్‌ తరహా రోటార్లను.. వేగంగా ప్రయాణించేందుకు వీ లుగా విమానాల వంటి రెక్కలు, ముందు భాగంలో ప్రొపెల్లర్‌ ఫ్యాన్‌ను అమర్చి ఈ డ్రోన్‌ను రూపొందించింది.

మరింత మెరుగైన  యూఏవీ తయారుచేస్తాం 
తక్కువ ఎత్తులో, తక్కువ దూరం ప్రయాణించే మల్టీరోటార్‌ (బహుళ రెక్కల) డ్రోన్లను ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో ఉపయోగిస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండే కొన్ని మల్టీరోటార్‌ డ్రోన్లు 40 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్న సాధారణ డ్రోన్లకు 20– 25 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. వాటికి తరచూ బ్యాటరీలను మార్చడమో, రీచార్జి చేయడమో తప్పనిసరి.

అదే ‘టీవర్క్స్‌’ రూపొందించిన యూఏవీకి ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఉంది. దీనిని మరింతగా మెరుగుపర్చే పనిలో ఉన్నాం. త్వరలో వంద కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరుకునేలా రూపొందిస్తాం. ఈ యూఏవీ తయారీకి అనుసరించిన సాంకేతికత, ఇతర అంశాలన్నింటినీ టీవర్క్స్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చాం. ఆసక్తి ఉన్న ఔత్సాహికులతో మా విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. యూఏవీల తయారీలో ఆసక్తి ఉన్న ముందుకు రావాలి. 
– సుజయ్‌ కారంపురి, టీవర్క్స్‌ సీఈవో 

ఏఎంఆర్‌టీ25 ప్రత్యేకతలివీ.. 
ఉన్నది ఉన్నట్టుగా పైకి ఎగిరి, అదే తరహాలో కిందికి దిగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్‌ కోసం కేవలం ఐదు మీటర్లు పొడవు, 5 మీటర్లు వెడల్పు ఉన్న స్థలం సరిపోతుంది. 
గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం తరహాలో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 80–90 మీటర్ల ఎత్తులో.. గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వెళ్లగలదు. 
నిలువుగా గాల్లోకి ఎగరడం (వీటీఓఎల్‌) కోసం నాలుగు రోటార్లు, ముందుకు దూసుకెళ్లడానికి ప్రొపెల్లర్‌ ఉన్నాయి. 
4 వీటీఓఎల్‌ రోటార్లకు 10వేల మిల్లీఆంపియర్‌హవర్‌ (ఎంఏహెచ్‌) బ్యాటరీని అనుసంధానం చేశారు. 
ముందుకు దూసుకెళ్లే ప్రొపెల్లర్‌ కోసం 30 సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్‌ ఇంజన్‌ను అమర్చారు. 
విమానం తరహాలో ఉండే రెక్కల వెడల్పు 2.5 మీటర్లు (రెండు వైపులా కలిపి..) 
ఈ డ్రోన్‌లోని అల్యూమినియం ప్రధాన ఫ్రేమ్‌తోపాటు కలప, ప్లైవుడ్, కార్బన్‌ ఫైబర్‌ విడిభాగాలను ‘టీవర్క్స్‌’లోనే త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతికతతో తయారు చేశారు. 
ప్రస్తుతం ఔషధాల సరఫరాకు వినియోగించినా.. ఏరియల్‌ సర్వే, తనిఖీలు, నిఘా, రక్షణ రంగ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు. 
ఏఎంఆర్‌టీ25 కిలో నుంచి కిలోన్నర బరువు మోసుకుని.. గరిష్టంగా 45–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 
వంద కిలోమీటర్ల దూరం, 3.5 కిలోల బరువు మోసుకెళ్లేలా ఈ డ్రోన్‌ కొత్త మోడల్‌ను తయారు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు