తహసీల్దార్‌ .. పనితో బేజార్‌

25 Apr, 2021 03:39 IST|Sakshi

తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్న తహసీల్దార్లు

ధరణి నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు బాధ్యతలన్నీ వీరిపైనే..!

మరీ ఇబ్బందికరంగా మారిన ధరణి సమస్యల పరిష్కారం

24 గంటల సమయం సరిపోవడం లేదంటున్న అధికారులు

పనిభారంతో తప్పులు దొర్లే అవకాశం ఉందనే ఆందోళన

తగిన సమయం ఇస్తే పనులన్నీ చేసేందుకు సిద్ధమని స్పష్టీకరణ

‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్‌కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’

‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’

ధరణి పోర్టల్‌ ద్వారా భూ సమస్యల పరిష్కారం
ఈ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత
కోవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్ల నిర్వహణ,
వ్యాక్సిన్‌పై అవగాహన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్‌ విధులు

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్‌ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్‌) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్‌ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్‌ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు కూడా
ధరణి పోర్టల్‌ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్‌ విధులు నిర్వహిస్తూనే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన.

ఇంకా ఎన్నో...
అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్‌ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్‌ఏలు, వీఆర్‌వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్‌ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు.

పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే...
ధరణి పోర్టల్‌ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్‌ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్‌లో తప్పులు, ఆధార్‌ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్‌ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్‌లైన్‌లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్‌ లాగిన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్‌ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్‌ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్‌లైన్‌లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్‌ ఇచ్చి కౌంటర్‌ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్‌లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్‌లైన్‌లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్‌ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి
రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్‌ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్‌ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 
- వంగా రవీందర్‌రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు