నెహ్రూ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోండి.. సీఎం కేసీఆర్‌కు భట్టి సూచన

13 Feb, 2023 07:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గుండు సూది కూడా తయారు చేసే స్థితిలో లేని తరుణంలో మన దేశానికి నెహ్రూ మొదటి ప్రధాని అయ్యారు. పంచవర్ష ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరుచుకుంటూ దేశా న్ని ప్రగతి బాటలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అందరం కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, ఈ రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్‌ నెహ్రూ స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17.39 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టుకున్నా ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తొలి సీఎంగా కేసీఆర్‌పై ఉందన్నారు. 

వారుంటే దేశం గతి ఏమయ్యేదో.. 
తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతంలో ఆశించిన లక్ష్యాలు నెరవేరవని.. ఉవ్వెత్తున సాగిన రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని చూసి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేందుకు చొరవ చూపిన విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రం అన్నాక ప్రతిపక్షాలుంటాయని, వాటిపై కక్ష సాధింపు ధోరణితో కాకుండా కలుపుకొని పోవాలన్న నెహ్రూ తరహాలో ఇక్కడ పాలన సాగాల్సి ఉందన్నారు. ఆ రోజు తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా ప్రస్తుత పాలకులలాంటి వారు ప్రధాని అయి ఉంటే దేశం గతి ఏమై ఉండేదోనని తల్చుకుంటేనే ఆందోళన కలుగుతోందని భట్టి వ్యాఖ్యానించారు.

దేశంలో శాస్త్రీయమైన పరిపాలన జరగడం లేదనటానికి, కరోనా వస్తే దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండిలాంటి సూచనలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయానికి కేటాయించిన నిధులు సరిపోవని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల పంపిణీ తేదీలను ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరారు. పోడు భూముల సాగును అడ్డుకునే క్రమంలో గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి తరిమేసేందుకు వారు తాగే నీళ్లను కలుషితం చేసే వికృత చేష్టలకు పాల్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.  

ప్రజాసమస్యలన్నీ చర్చకు రాలేదు
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను 28 రోజుల పాటు జరపాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం కోరితే ప్రభుత్వం కేవలం 7 రోజుల్లో ఈ సమావేశాలను ముగించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యలన్నీ చర్చకు రాలేదని విమర్శించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆదివారం సాయంత్రం మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మాజీ ప్రధాని నెహ్రూ వేసిన పునాదులే దేశాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంత తక్కువ రోజులు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడం దేశంలోనే ఇదే మొదటిసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ, మండలిపై బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ ఆమోదంపై చర్చ జరిగిందో, కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగిందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకే కేంద్రంపై నెపం నెట్టారని, కేసీఆర్‌ చిన్నబుద్ధి బయటపడిందని చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో సగం నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం తమకు లేదని జీవన్‌రెడ్డి అన్నారు.
చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు