కేసీఆర్‌ వరి పండిస్తే తప్పేంటి?: తలసాని 

28 Dec, 2021 04:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సీఎం కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కొందరంటున్నారు. వారిని ఎవరైనా నామినేట్‌ చేశారా? ప్రజలు ఎన్నుకుంటే గెలిచారు. సీఎం అనే గౌరవం లేకుండా కొందరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు, కేటీఆర్‌ కుమారుడిని కూడా దూషించే నీచస్థాయికి దిగజారారు’అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ‘మాకు కూడా తిట్టడం తెలుసు.

నోరుంది కదా అని మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సరైనరీతిలో బుద్ధి చెప్తారు’అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలసి శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాయలయంలో మీడియాతో మాట్లాడారు. ‘బాధ్యతాయుత పదవిలో ఉంటూ రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలం వాడుతున్నారు. కేసీఆర్‌ వరి పండిస్తే తప్పేంటి, ఆయన పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రశ్నించాలి. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎక్కడ ఉన్నారు’అని విమర్శించారు. తెలంగాణకు నిధులివ్వని కేంద్రం అవార్డులు మాత్రం ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని తలసాని అన్నారు. బీజేపీ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ సొంత రాష్ట్రం పంజాబ్‌లోనే ఆ పార్టీకి దిక్కులేదని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు