ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

26 Feb, 2022 00:57 IST|Sakshi

రాంనగర్‌ నాలాపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం

8 వేల కుటుంబాలకు ముంపు సమస్య నుంచి ఉపశమనం 

పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

ముషీరాబాద్‌: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని వీఎస్‌టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్‌ రోడ్డులో హెరిటేజ్‌ బిల్డింగ్‌ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, కార్పొరేటర్‌ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్‌ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్‌ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.

సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.  

స్టీల్‌ బ్రిడ్జితో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం.. 
హుస్సేన్‌సాగర్‌ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్‌ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా వీఎస్‌టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సీఈ కిషన్, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్‌ వర్క్స్‌ జీఎం సుబ్బారాయుడు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్‌ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, కార్పొరేటర్‌ సునీత తదితరులు   

మరిన్ని వార్తలు