విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు

4 Sep, 2021 02:40 IST|Sakshi
రావిర్యాలలో ‘మెగా డెయిరీ’ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు సబిత, తలసాని

రెండేళ్లలో విజయ మెగా డెయిరీ నిర్మాణం పూర్తి: మంత్రి తలసాని వెల్లడి 

ఏడాది పొడవునా పాలను సేకరిస్తాం  

బోనస్‌రాని రైతులకు త్వరలో చెల్లిస్తాం

 తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 

15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం 
పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్‌ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్‌ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్‌లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్‌ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక భూమారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు