రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

13 Jan, 2021 02:36 IST|Sakshi
మాట్లాడుతున్న తలసాని

ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది: తలసాని

అధికారులు, పౌల్ట్రీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి స్పష్టీకరణ 

పాల్గొన్న మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేవని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. చికెన్, గుడ్లు తింటే ఎలాంటి నష్టమూ జరగదన్నారు. దేశవ్యాప్తం గా వివిధ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం నేపథ్యంలో మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్‌ రెడ్డితో కలసి పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు, ప్రొఫె సర్లు, పశువైద్యశాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. బర్డ్‌ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ వ్యాధి కనిపించినట్లు సమాచారం అందగానే పశుసంవర్థక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు చెప్పా రు.

నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలో కోళ్ల మృతిపై సమాచారం రాగానే 276 శాం పిల్స్‌ సేకరించామని, అలాగే గత మూడు రోజుల్లో వెయ్యి నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలు గా సహకరిస్తుందని తెలిపారు. మన రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితమన్నారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. గతం లో బర్డ్‌ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం మాత్రమే నష్టపోయిందని, మనుషులకు నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్లను అందించే శక్తి చికెన్, గుడ్లకే ఉందన్నారు. భేటీలో అధికారులు అనితా రాజేంద్ర, రిజ్వీ, వాకాటి కరుణ, డా.శ్రీనివాస్‌ రావు, డా.వి.లక్ష్మారెడ్డి, డా.రాంచందర్, బ్రీడర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వి.హర్షవర్ధన్‌ రెడ్డి, బ్రీడర్స్‌ ప్రధాన కార్యదర్శి జి.రమేశ్‌ బాబు, నెక్‌ సీఈవో కె.జి.ఆనంద్, చైర్మన్‌ ఏ.గోపాల్‌రెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రతినిధులు కె.మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, చంద్రశేఖర్‌ రెడ్డి, స్నేహ చికెన్‌ డి.రాఘవరావు పాల్గొన్నారు. 

25లోగా హాస్టళ్లకు బియ్యం సరఫరా

సమావేశంలో గంగుల, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 25వ తేదీలోగా సన్నబియ్యం అందుబాటులో ఉంచాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. సన్నబియ్యంతో పాటు పప్పు, ఉప్పులు, నూనె, ఇతర రేషన్‌ సరుకులను అందుబాటులో ఉంచడంతో పాటు శానిటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. 26 తర్వాత హాస్టళ్లలో వసతులపై మంత్రులు, శాసన సభ్యులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఏర్పాట్లను మంత్రి గంగుల మంగళవారం తన కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాదాపు 9 నెలల నుండి హాస్టళ్లు, స్కూల్స్‌ మూతపడి ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యంగా శానిటేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు పౌరసరఫరాల సంస్థ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోందని ప్రతినెల 8,500 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని చెప్పారు. దాదాపు 74వేల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోగా గోదాముల నుండి హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు