81 కోట్ల చేపలు.. 5 కోట్ల రొయ్యలు 

28 Jul, 2020 04:42 IST|Sakshi

ఆగస్టు 5 నుంచి మళ్లీ చెరువుల్లో చేపల విడుదల

రూ.60 కోట్లు వ్యయ అంచనా..

త్వరలోనే రెండో విడత గొర్రెలు, గేదెల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండో విడత చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేతత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లోని 24 వేల చెరువులు, రిజర్వాయర్లలో రూ.50 కోట్ల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను, 78 నీటి వనరులలో రూ.10 కోట్ల ఖర్చుతో 5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను విడుదల చేసేలా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 5న సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌లలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ చేప పిల్లలను విడుదల చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో ఆ కార్యక్రమానికి 25 మంది మాత్రమే ఉండేలా చూడాలని, మాస్క్‌లు తప్పని సరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.ఇక, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడత పాడి గేదెలు, గొర్రెల పంపిణీ ని త్వరలోనే చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, టీఎస్‌ ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు, ఏడీ రాంచందర్, మత్స్య శాఖ జేడీ శంకర్‌ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

కేసీఆర్‌ నిర్ణయాలతో సంతోషం..  
అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన మానసపుత్రిక అయిన ఉచిత చేప పిల్లల, గొర్రెల, పాడి గేదెల పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు అందించినట్లు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. చేపలను ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం అభివృ ద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలు మరణి స్తే బీమా ద్వారా జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి ఇస్తున్నామన్నారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962 ద్వారా గ్రామాల్లోని జీవాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి మే 2021 వరకు కత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రస్తుతం కరీం నగర్‌లోని కేంద్రం ద్వారా మాత్రమే పశువీర్య ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు