ధైర్యంగా ఉంటేనే పరీక్షల్లో విజయం: గవర్నర్‌

2 Apr, 2022 02:59 IST|Sakshi
‘ఎగ్జామ్‌ వారియర్స్‌’తెలుగు అనువాదం పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు మానసిక దృఢత్వం, ధైర్యంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దీనికోసం మానసిక ప్రశాంతత, విశ్రాంతి అవసరమని సూచించారు. రాజ్‌భవ  దర్బార్‌హాల్‌లో జరిగిన ప్రధానమంత్రి ఇంటరాక్షన్‌ ప్రోగ్రామ్‌ ‘పరీక్షా పే చర్చా’5వ ఎడిషన్‌లో ఆమె వివిధ పాఠశాలల విద్యార్థులతో కలసి వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఆమె విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ’పరీక్షా పే చర్చా’కార్యక్రమం త్వరలో జరిగే బోర్డు, ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ప్రశాంతంగా హాజరయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కూడిన సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమవ్వడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తెలిపారు.

విద్యార్థులు ప్రధాని సలహాలను పాటించాలని, భయాందోళనలకు దూరంగా ఉండి, పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, రంగారెడ్డి జిల్లా నల్లగండ్ల జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రధానమంత్రి ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’తెలుగు అనువాదాన్ని విద్యార్థులకు అందించారు.  

రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు బ్రహ్మాండం: గవర్నర్‌ 
రెడ్‌క్రాస్‌ సొసైటీ ఇప్పటి వరకు బ్రహ్మాండమైన సేవలందించిందని, ఇక ముందు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలైన తమిళిసైని రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ శాఖ చైర్మన్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌ మిశ్రా, వివిధ జిల్లాల రెడ్‌క్రాస్‌ చైర్మన్లు, రాష్ట్ర పాలక వర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి రెడ్‌క్రాస్‌ కార్యక్రమాలఫై చర్చించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ జనరిక్‌ దుకాణాలను పేద ప్రజల కోసం అందుబాటులో ఉంచాలని, జూనియర్, యూత్‌ రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయాలని సూచించారు. వరంగల్, హన్మకొండల్లో మాదిరిగా తలసేమియా పిల్లలను గుర్తించాలని, వారి కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. 

మరిన్ని వార్తలు