సర్వాధికారిలా తెలంగాణ సీఎం

20 Apr, 2022 02:33 IST|Sakshi

ఆయనతో గ్యాప్‌ ఉన్న మాట నిజమే 

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారే అప్రజాస్వామికంగా వ్యవహరించడం విచిత్రం 

రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌లా ఏమాత్రం ఉండను... రాజ్యాంగానికి కట్టుబడే నడుచుకుంటా 

ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తా... గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తానే గానీ రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌గా నడుచుకోనని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. తెలంగాణ సీఎం సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘ఆయనతో గ్యాప్‌ ఉన్నమాట నిజమే. అంతకంటే ఎక్కువ చెప్పను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారే అప్రజాస్వామికంగా వ్యవహరించడం విచిత్రం..’అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ గవ ర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా విధుల నిర్వహణ, సేవా కార్యక్రమాలపై స్వయంగా రూపొందించిన రెండు పుస్తకాలను తమిళిసై మంగళవారం చెన్నైలో ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించి ‘ఒన్‌ ఎమాంగ్‌ అండ్‌ ఎమాంగస్ట్‌ ది పీపుల్‌’, పుదుచ్చేరి పాలనపై ‘ఏ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’అనే పుస్తకాల తొలి ప్రతులను తన భర్త డాక్టర్‌ సౌందరరాజన్‌కు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ పాత్రికేయులనుద్దేశించి గవర్నర్‌ మాట్లాడారు.  

తెలంగాణ సీఎంతో పనిచేశాక ఎక్కడైనా పనిచేయొచ్చనిపిస్తోంది 
‘గవర్నర్‌గా విమర్శలను అధిగమించడం ఒకింత కష్టంగానే ఉంది. రాజకీయాల్లో ఉన్నా, గవర్నర్‌గా మారినా విమర్శలు నన్ను వెంటాడుతూనే ఉన్నా యి. ఇటీవల వివాహం నిమిత్తం ఢిల్లీ వెళితే కేరళకు గవర్నర్‌గా బదిలీ అయినట్లు మీడియాలో ప్రచారం జరగడంతో ఆశ్చర్యపోయాను. తెలంగాణ గవర్నర్‌గా అక్కడి సీఎంతో పనిచేసిన తరువాత దేశంలో ఎక్కడైనా, ఏ పదవిలోనైనా పనిచేయవచ్చని అన్పిస్తోంది. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నా, ఏ రాష్ట్రంలోనూ చిన్నపాటి లోపం లేకుండా జాగ్రత్త వహిస్తున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రులను మేనేజ్‌ చేస్తున్నాను. వీరిద్దరివద్ద పనిచేసిన అనుభవంతో ఎక్కడైనా పని చేయగలననే నమ్మకం, ధైర్యం, అనుభవం వచ్చాయి..’అని గవర్నర్‌ అన్నారు. 

పుదుచ్చేరి సీఎం ఇలా..తెలంగాణ సీఎం అలా.. 
‘ఫుల్‌టైం గవర్నర్‌ కావాలని అడుగుతున్నారు. ఫుల్‌టైం గవర్నర్లు రాజ్‌భవన్, రాజ్‌నివాస్‌లకు పరిమితం కావొచ్చు. పార్ట్‌టైం గవర్నర్లు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడవచ్చు. ఏ రాష్ట్రమైనా గవర్నర్‌ బాధ్యతలను రాజకీయ కోణంలో చూడరాదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నేను అందిస్తున్న సహకారానికి పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఒకవైపు బహిరంగంగా కృతజ్ఞతలు తెలుపుతుంటే తెలంగాణ సీఎం ఇందుకు భిన్నంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రజాసంక్షేమం కోసం గవర్నర్, సీఎం కలిసి పనిచేస్తే ఎంత ప్రగతి సాధించవచ్చో చెప్పడానికి పుదుచ్చేరి ఉదాహరణైతే.. విభేదాలతో ముందుకు సాగితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో తెలియడానికి తెలంగాణ ఉదాహరణ’అని తమిళిసై పేర్కొన్నారు. ‘పరిపాలకులకు.. ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నామనే విషయంలో స్పష్టత ఉండాలి. బాధలు భరిస్తూనే, ఎలాంటి అడ్డంకులైనా అధిగమించేందుకు నేను సిద్ధం. రబ్బర్‌ స్టాంప్‌ గవర్నర్‌గా ఎంతమాత్రం ఉండను. బలమైన గవర్నర్‌గా మహిళలు ఉండలేరా? మహిళలకు పరిపాలన సామర్థ్యం లేదని భావించరాదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు