TSRTC Ticket Price Hike: పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలి

19 Mar, 2022 04:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లె వెలు గు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని వేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి బడ్జెట్‌లో సరిపోయినన్ని నిధులు కేటాయించి సంస్థను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం, నేడు ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌ వారికి కట్టబెట్టి, ప్రయాణ టికెట్‌ రేట్లు పెంచి పూడ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. చినజీయర్‌ స్వామి ప్రజల నమ్మకాలు, ఆహారాలు, కులాలు, వృత్తులపైన బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ అవమానపర్చడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు