Tank Bund: అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?  

30 Dec, 2021 08:02 IST|Sakshi

ఈ–చలాన్లతో వేగ నియంత్రణ సరి

డివైడర్ల ఏర్పాటుకూ అనేక అడ్డంకులు

వన్‌వే నిబంధన అమలుతోనే ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ చిన్నారిని బలి తీసుకోగా.. ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడటానికి కారణమైంది. ఈ ప్రాంతం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాల జాబితాలో, పాదచారులకు రెడ్‌జోన్‌గానూ ఉంది. ట్యాంక్‌బండ్‌పై 2012 అక్టోబర్‌ 27 రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసు లోకాయుక్త సుమోటోగా స్వీకరించే వరకు వెళ్లింది. అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ ఈ రహదారి భద్రతపై ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పటికైనా శాశ్వత చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు ట్యాంక్‌బండ్‌కు బలయ్యే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట.  

అత్యంత కీలక రహదారి... 
అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌ నుంచి వైస్రాయ్‌ చౌరస్తా వరకు దాదాపు 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్‌బండ్‌ పాఠశాల, వ్యాపార జోన్‌లలో ఏ ఒక్కదాని కిందికీ రాదు. అయితే జంట నగరాలకు అనుసంధానంగా ఉన్న దీని చుట్టూ కీలకమైన ప్రాంతాలు, కార్యాలయాలు ఉన్నాయి. సచివాలయం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, మింట్‌ కాంపౌండ్‌ తదితరాతో పాటు పర్యాటక స్థలాలైన ఐమాక్స్, పీవీ మార్గ్, ఎన్టీఆర్‌ మార్గ్, లుంబినీపార్క్, ఎన్టీఆర్‌ గార్డెన్‌ తదితరాలు విస్తరించి ఉన్నాయి. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్‌ లేకుండా ఉండే రహదారి ట్యాంక్‌బండ్‌. రహదారి వెడల్పు తక్కువగా ఉండటం, ప్రతి ఏటా జరిగే నిమజ్జనాలు, ఇటీవల ప్రారంభమైన సన్‌డే–ఫన్‌డే తదితరాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై డివైడర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది.
చదవండి:  జిరాక్స్‌ తీస్తే కొంపలు అంటుకుంటాయ్‌..!?

ఈ–చలానాలతోనే సరా..? 
►  ఈ ప్రాంతంలో గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది.

► దీన్ని ఉల్లంఘిచిన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌ లేజర్‌ గన్స్‌తో కాచుకుని ఉంటారు. ఈ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు.

► అయితే వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందే తప్ప ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాలు తగ్గే దాఖలాలు కనిపించట్లేదు.

► మరోపక్క ఎలాంటి సాంకేతిక నిపుణుల పోస్టులు లేని ట్రాఫిక్‌ పోలీసులు ఈ గరిష్ట వేగాన్ని ఎలా నిర్ధారించారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

► ట్రాఫిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వింగ్‌ పేరుతో ఇంజనీర్లతో నిండిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఇలాంటి ప్రాంతాలను సాంకేతికంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో ట్రాఫిక్‌ పోలీసుల్ని భాగస్వాముల్ని చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ‘గ్రేటర్‌’ మాత్రం అవసరమైన స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు.  

ఇలా ఎందుకు చేయరు?  
► ఇరుకుగా ఉండటంతో పాటు డివైడర్‌ లేని ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ మార్గాన్ని వన్‌వేగా ప్రకటించాలి.

► నిర్దేశిత సమయంలో అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ను ఒక దిశలో వెళ్లే వాహనాలకు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ను మరో దిశ వెళ్లే వాహనాలు కేటాయించాలి. ‘సన్‌డే–ఫన్‌డే’ సమయంలో ట్యాంక్‌బండ్‌ మొత్తాన్ని మూసేస్తున్న విషయం గమనార్హం.

►ట్యాంక్‌బండ్‌పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి. అక్కడికి వచ్చే వారు చూడాల్సిన విగ్రహాలు, జలాలు కూడా రెండు వైపులానే ఉన్నాయి కాబట్టి వీటివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు.     

మరిన్ని వార్తలు