గవర్నర్‌లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్‌

8 Apr, 2022 11:08 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: ‘గవర్నర్‌తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్‌ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

గవర్నర్‌ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్‌రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్‌ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్‌ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్‌ నిలదీశారు.  

నరసింహన్‌ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు 
గవర్నర్‌గా నరసింహన్‌ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు.

శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్‌ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్‌ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్‌ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్‌ అన్నారు.

(చదవండి: తారా స్థాయికి చేరిన గవర్నర్‌, రాష్ట్ర సర్కార్‌ మధ్య విభేదాలు..)

మరిన్ని వార్తలు