పన్నులు భళా.. ఖజానా గలగల

15 Jan, 2023 01:33 IST|Sakshi

ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల మేరకు రూ.1.20 లక్షల కోట్లు వచ్చే అవకాశం

తొలి 8 నెలల్లో రూ. 80 వేల కోట్లు దాటిన రాబడులు.. జీఎస్టీ పద్దులోనే రూ. 27 వేల కోట్లు

అమ్మకపు పన్ను మినహా అన్ని పన్నుల వసూళ్లు 60 శాతం పైమాటే..

అత్యధికంగా ఇతర పన్నులు... ఇప్పటికే అంచనాల్లో 94% రాబడులు

జీఎస్టీ పద్దు 100% దాటుతుందని అంచనా.. గతేడాదిలోనూ 97% వసూలు

పన్ను ఆదాయంపై ఆశలతోనే 2023–24 బడ్జెట్‌కు ప్రాణం పోస్తున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు పన్నుల కళ వచ్చింది. కరోనా అనంతరం గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థికవృద్ధిలో పన్ను వసూళ్లే కీలకపాత్ర పోషిస్తున్నాయి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో(2022 మార్చి నుంచి నవంబర్‌ వరకు) రూ.80 వేల కోట్ల వరకు పన్ను ఆదాయం సమకూరింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను పన్నుల ఆదాయం కింద రూ.1.26 లక్షల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 64 శాతం మేర ఇప్పటికే సమకూరింది. ఒక్క వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పద్దు కిందనే రూ.27 వేల కోట్ల ఆదాయం వచ్చింది.

మొత్తం ఈ ఏడాది జీఎస్టీ పద్దు కింద రూ.42 వేల కోట్ల అంచనా కాగా, అందులో 65 శాతం ఖజానాకు చేరింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీఎస్టీ వసూళ్లు పెద్దఎత్తున ఉండనున్న నేపథ్యంలో మరో రూ.15 వేల కోట్లు రావచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం 60 శాతం మించగా, ఎక్సైజ్‌ రాబడులు 66 శాతం వరకు వచ్చాయి. ఈ పద్దులన్నింటి కింద మార్చినాటికి 100 శాతం అంచనాలు కార్యరూపం దాల్చే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అత్యధికంగా ఇతర పన్నులు బడ్జెట్‌ అంచనాల్లో ఇప్పటికే 93 శాతానికి చేరుకున్నాయి. అయితే, అమ్మకపు పన్ను మాత్రమే 60 శాతం కన్నా దిగువన ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం కింద ప్రతిపాదించిన రూ.1.26 లక్షల కోట్లు సమకూరుతాయనే ధీమా ఆర్థికశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీటికితోడు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దులు ఆశించిన మేరకు వస్తే బాగుండేదని, వీటితోపాటు అప్పుల రూపంలో రూ.15 వేల కోట్ల వరకు బడ్జెట్‌లో కోత పడిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవి కూడా సమకూరితే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలే ఉండవని, కొత్త పథకాల అమలు కూడా పెద్ద కష్టమేమీకాబోదని వెల్లడిస్తుండటం గమనార్హం. 

పన్ను ఆశల మీదనే బడ్జెట్‌ ఊసులు..
ప్రతి ఏటా పన్నుల వసూళ్లలో పెరుగుదల కనిపిస్తుండడంతో ఈసారి బడ్జెట్‌ను కూడా ఆశావహ దృక్పథంతోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 2022–23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ. 2,56,858 కోట్ల బడ్జెట్‌కు 15 శాతం పెంచి 2023–24 బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశముందనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. కాగా, గతేడాది సెప్టెంబర్‌ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగి నందున ఈ ఏడాది మార్చి మొదటి వారంలోపు మరోమారు సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. 

మరిన్ని వార్తలు