5 నెలలు.. 5 వేల కోట్ల లోటు

1 Oct, 2020 02:14 IST|Sakshi

తగ్గిన పన్ను రాబడి

గతేడాది ఆగస్టు కల్లా రూ.30 వేల కోట్ల ఆదాయం 

ఈ ఏడాది కరోనా దెబ్బకు రూ.25వేల కోట్లే 

తొలి రెండు నెలలూ కలిపి వచ్చింది రూ.5వేల కోట్లే 

గత మూడు నెలల్లోనే రూ.20వేల కోట్ల వరకు రాబడి 

ఇదే ఒరవడి మరో ఏడు నెలలు కొనసాగినా వచ్చేది 70 శాతమే! 

మరింత అప్పులు చేయక తప్పని స్థితి.. ఆగస్టు నాటికే 

రూ.24వేల కోట్లు దాటిన అప్పులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విపత్తు నుంచి రాష్ట్ర ఖజానా కోలుకుంటోంది కానీ...పన్ను ఆదాయం మరింత మెరుగవ్వాలని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో మొత్తం రూ.5వేల కోట్ల లోటు ఏర్పడింది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన వివరాల ప్రకారం 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి వచ్చిన పన్ను ఆదాయం రూ. 25 వేల కోట్లు మాత్రమే. అదే 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి రూ.30వేల కోట్లు పన్నుల రూపేణా వచ్చాయి. ఈ ఏడాది రూ. లక్ష కోట్లకు పైగా పన్ను ఆదాయం వస్తుందని రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో అంచనా వేశారు. అందులో ఇప్పటిదాకా కేవలం 24.66 శాతం మాత్రమే వచ్చింది. అదే గత ఏడాది వార్షిక బడ్జెట్‌ అంచనాలో ఆగస్టు నాటికి రూ.36.78 శాతం పన్ను ఆదాయం సమకూరడం గమనార్హం.  

జూన్‌ నుంచి కోలుకుని.. 
ఈ ఏడాది పన్ను ఆదాయం గణాంకాలను పరిశీలిస్తే తొలి రెండు నెలలు కలిపి వచ్చింది కేవలం రూ.5,382 కోట్లే. అదే గత ఏడాది చూస్తే... తొలి మాసం (ఏప్రిల్‌)లోనే రూ. 5,226 కోట్ల రాబడి వచ్చింది. కరోనా దెబ్బకు తొలి రెండు నెలలు విలవిల్లాడిన రాష్ట్ర ఖజానా జూన్‌ నుంచి కోలుకుంటోంది. అయితే, జూన్‌ నుంచి ఆగస్టు వరకు వరుసగా మూడు మాసాల్లోనూ దాదాపు ఒకే విధంగా పన్నుల ద్వారా ఆదాయం లభించింది. జూన్‌లో రూ. 6,510 కోట్లు, జూలైలో రూ. 6,588 కోట్లు, ఆగస్టులో రూ.6,677 కోట్లు పన్నుల రూపేణా రాష్ట్ర ఖజానాకు చేరాయి. అంటే ఈ మూడు నెలల్లోనే రూ.20వేల కోట్ల వరకు వచ్చాయన్నమాట. ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ఐదు నెలలు ముగిసిన నేపథ్యంలో ఇదే ఒరవడి కొనసాగితే తప్ప రెవెన్యూ పద్దు సజావుగా సాగే పరిస్థితి ఉండదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

అలా వచ్చినా మరో రూ.46వేల కోట్ల వరకు వచ్చే మొత్తంతో కలిపి ఏడాది పన్నుల రాబడి రూ.71 వేల కోట్ల వరకు మాత్రమే వస్తుందని, మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో అది 70 శాతమే ఉంటుందని అంటున్నారు. అదే గత ఏడాది వార్షిక బడ్జెట్‌ అంచనాలో పన్నుల ద్వారా రూ. రూ.89,047 కోట్లు వస్తాయని పేర్కొనగా, అందులో 93.87 శాతం అంటే రూ. 83,904 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల్లో కేవలం రూ.6వేల కోట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. కానీ, ఈ ఏడాది ఎక్కువలో ఎక్కువగా 75 శాతానికి మించే పరిస్థితి కనిపించడం లేదు. 

అప్పుల తిప్పలు తప్పనట్టే 
పన్నుల రాబడి చక్రం ఈసారి ఏమాత్రం పట్టు తప్పినా రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు నెలలుగా వస్తున్న రాబడులు కొనసాగితే ఇతర మార్గాల్లో కూడా కొన్ని నిధులు సమకూర్చుకుని నెట్టుకురాగలం కానీ.. ఈ ఆదాయంలో ఎక్కడ తేడా వచ్చినా అప్పుల కుప్ప పేరుకుపోతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.24వేల కోట్లకు పైగా అప్పులు తీసుకురావాల్సి వచ్చిందని, అదే గత ఏడాది మొత్తానికీ కలిపి తెచ్చిన అప్పులు రూ.29వేల కోట్లేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.20వేల కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా అప్పులను తగ్గిస్తోంది. తొలి రెండు నెలల్లోనే రూ.13వేల కోట్లను రుణాల ద్వారా సమీకరించగా, ఆ తర్వాతి మూడు నెలలు తగ్గించింది. ఈ రుణ సమీకరణ రానున్న మూడు నెలల్లో మరింత తగ్గుతుందని, ఆ మేరకు పన్నుల ఆదాయం సమకూరుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు