పెరుగుతున్న టీబీ కేసులు

24 Dec, 2020 09:07 IST|Sakshi

మొబైల్‌ వాహనం ద్వారా 650 మందికి పరీక్షలు

 70 మందికి నిర్ధారణ

 ఏటా 1500 నుంచి 2వేల మందికి సోకుతున్న వ్యాధి

ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి టీబీని నిర్మూలించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాధిగ్రస్తులను నిర్ధారించేందుకు ప్రత్యేక సంచార వాహనంతో ఊరూరా తిరుగుతూ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిధిలో వారం రోజుల పాటు పరీక్షలు చేయగా వ్యాధిగ్రస్తులు బయటపడ్డారు. ఏడాదికి 1500 నుంచి 2వేల మందికి వ్యాధి సోకుతున్నట్లు వైద్యాశాఖాధికారులు  చెబుతున్నారు. వ్యాధి సోకినవారు జనాలు హేలన చేస్తారనే భయంతో పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడం లేదని తెలుస్తోంది. దీంతో టీబీ తగ్గుముఖం పట్టేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య శాఖ వ్యాధిపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతోనే పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

70 మందికి టీబీ నిర్ధారణ
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన సంచార వాహనం ద్వారా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీబీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 650 మంది పరీక్షలు చేయగా 70 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నార్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 5, దంతన్‌పల్లిలో 5, ఇంద్రవెల్లిలో 18, వాయిపేట్‌లో 15, తాంసిలో 7, భీంపూర్‌లో 5, సిరిచెల్మలో 10, ఆదిలాబాద్‌ పట్టణంలోని పుత్లీబౌళి, శాంతినగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 5గురు చొప్పున టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, రిమ్స్‌ వైద్య కళాశాలలో సైతం టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఆయా పీహెచ్‌సీలకు వెళ్లి పరీక్షలు చేయించుకోకపోవడంతోనే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయినవారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. అలాగే పౌష్టికాహారం కోసం నెలకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

విస్తరిస్తున్న వ్యాధి 
టీబీ (క్షయ) వ్యాధి విస్తరిస్తోంది. ఏటా దాదాపు 2వేల మంది వరకు వ్యాధి బారిన పడుతున్నారు. చికిత్స తీసుకోకుంటే మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మంది అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా టీబీ టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. టీబీ నిర్ధారణ అయిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మందులు వాడాల్సి ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్యం చేసి మధ్యలో మందులు మానేయడంతో టీబీ ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సంవత్సరానికి 30 నుంచి 50 మంది వరకు మరణిస్తున్నారు.  టీబీ వ్యాధి సోకిన వారికి వారానికి మించి దగ్గు తగ్గకపోవడం, రాత్రుల్లో జ్వరం ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి మందగిస్తుంది. ఇది అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా టొబాకో, పొగాకు, అల్కాహాల్‌ తీసుకునే వారికి తీవ్రంగా సోకుతుంది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావడంతో శ్వాసకోశ సంబంధిత సమస్య ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వెంట్రుకలు, గోర్లు తప్పా అన్ని భాగాలకు విస్తరిస్తుంది. టీబీ సోకినవారు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది.

మందుల ద్వారా నయం అవుతుంది
టీబీ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కాని కొంతమంది అపోహలతో పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. వ్యాధి నిర్ధారణ అయితే మందుల ద్వారా నయం అవుతుంది.  
– ఈశ్వర్‌రాజ్, జిల్లా క్షయ నివారణ అధికారి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు