హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చా

11 Nov, 2022 00:45 IST|Sakshi

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు స్వోత్కర్ష

సాక్షి, హైదరాబాద్‌: ‘20 ఏళ్ల క్రితమే విద్యకు పెద్దపీట వేసి ఐటీని అభివృద్ధి చేశా. సైబరాబాద్‌కు నేనే స్వయంగా పేరు పెట్టా. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చా. తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 2,75,853 ఉందంటే ఆనాడు నేను ప్రకటించిన విజన్‌–2020 వల్లే. నాడు హైటెక్‌సిటీ కట్టకపోతే, నాలెడ్జి సిటీ, ఐఎస్‌బీ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకు రాకపోతే ఈ పరిస్థితి ఉండేదా?’

అంటూ తెలుగు దేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు మరోసారి స్వోత్కర్షకు పోయారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ గురువారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగు పిల్లలు ఉన్నారంటే అది టీడీపీ గొప్పతనమేనని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశానన్నారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ఉర్దూ యూనివర్సిటీ, నల్సార్‌ యూని వర్సిటీ మొదలైన ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొచ్చినట్లు చెప్పారు. తన నిర్ణయాల వల్ల ఆర్థికంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, అత్యధిక భూముల విలువ లు ఉన్న రాష్ట్రంగా మారిందని పేర్కొ న్నారు. తన నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ నాలెడ్జ్‌ ఎకానమీ హబ్‌గా తయారైందన్నారు. నాడు బయో టెక్నాల జీని పరిచయం చేయడం వల్లే నేడు ‘భారత్‌ బయో టెక్‌’ కరోనాకు టీకా కనుగొన్నదని చెప్పారు. ఆనాడు పునాది తాను వేస్తే వై.ఎస్‌., రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ కొనసాగించారన్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రసూన కంటతడి..
వేదికపై ప్రసంగించే నలుగురు నేతలు మాత్రమే కూర్చోవాలని.. మిగిలిన వారు కిందకు దిగాలని నిర్వాహకులు చెప్పడంతో టీటీడీపీ సీనియర్‌ నా యకురాలు కాట్రగడ్డ ప్రసూన తీవ్ర ఆవేదన చెందారు. పార్టీలో మిగిలి ఉన్న ముగ్గురు మాజీ ఎమ్మె ల్యేలలో తాను ఒకరినని చెప్పినా వారు వినకపోవ డంతో కంటతడి పెడుతూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. కొందరు నాయకులు తనకు కనీస గౌరవం ఇవ్వ కుండా వేదిక నుంచి కిందకు దింపి అమర్యాదగా వ్యవహరించారంటూ చంద్ర బాబుకు లేఖ పంపి ఆమె ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిసింది.

టీటీడీపీకి పూర్వవైభవం తెస్తా
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభ వం తీసుకొస్తానని ప్రమా ణ స్వీకారం అనంతరం మా ట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. అంతకు ముందు జూబ్లీ హిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీ ఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వరకు ఓపెన్‌ టాప్‌ జీపులో చంద్రబాబుతో కలసి ఆయన ర్యాలీగా వచ్చా రు. రెండున్నర గంటలపాటు ర్యాలీ కొనసాగ డంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ధర్నా
టీటీడీపీ అధ్యక్షుడిగా కాసా ని జ్ఞానేశ్వర్‌ ప్రమాణ స్వీకారానికి తమను తీసుకొచ్చి డబ్బివ్వకుండా వెళ్లిపోయారంటూ దాదాపు 80 మంది సినీ జూనియర్‌ ఆర్టిస్టు లు ఆందోళన నిర్వహించారు. గంటపాటు సమావేశంలో పాల్గొంటే రూ. 300 చొప్పున ఇస్తామంటూ రాజు, ఆరిఫ్‌ అనే వ్యక్తులు చెప్పడంతో సాగర్‌ రింగ్‌రోడ్‌ ప్రాంతానికి చెందిన సుజాత 80 మందిని ఎన్టీఆర్‌ భవన్‌కు తీసుకొచ్చింది.

సమావేశం అనంతరం రాజు, ఆరిఫ్‌ పత్తా లేకుండా పోవడం, ఫోన్‌ సైతం ఎత్తకపోవడంతో వారంతా తొలుత ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద, ఆ తర్వాత రోడ్‌ నంబర్‌ 14లో ఆందోళనకు దిగారు. టీడీపీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీ సులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. 

మరిన్ని వార్తలు