రాయితీలు.. ఇంకా రాలే..

3 Jan, 2022 04:21 IST|Sakshi

టీ ఐడియా, టీ ప్రైడ్‌ కింద రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు 

బడ్జెట్‌లో కేటాయించినా అందని పారిశ్రామిక ప్రోత్సాహకాలు  

అమలుకు నోచుకోని రాష్ట్రస్థాయి కమిటీ తీర్మానాలు 

సీనియారిటీని పక్కన పెట్టి సిఫారసులు తెచ్చిన కంపెనీలకు లబ్ధి 

సతమతమవుతున్న పరిశ్రమల యాజమాన్యాలు 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గోమతి కాటన్‌ ఇండస్ట్రీస్‌ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు.  

కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్‌’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్‌లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్‌ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్‌ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే.

నవంబర్‌ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్‌ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. 

ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్‌’ 
పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్‌’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్‌ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్‌’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.

వీటికింద రాయితీ, స్టాంప్‌ డ్యూటీ, సేల్స్‌ టాక్స్, భూమి ధర, విద్యుత్‌ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్‌లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. 

బడ్జెట్‌లో కేటాయించినా..! 
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు.

అంతకుముందు బడ్జెట్‌లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి.  

మరిన్ని వార్తలు