‘స్పీడ్‌’ రూల్స్‌ ఇక పక్కా!

27 May, 2022 07:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్‌ వింగ్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో  కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.  

ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్‌ లేజర్‌ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్‌వేర్‌ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్‌వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్‌ బోర్డులు, సోషల్‌ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. 

సుదీర్ఘ అధ్యయనం చేశాం
నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్‌ మోడల్‌ను హైదరాబాద్‌కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్‌ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్‌ రోడ్‌ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్‌ప్రెస్‌ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. 
– ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌   

(చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు )

మరిన్ని వార్తలు