వివాదాలు పరిష్కరించి.. పదోన్నతులు!

10 May, 2022 03:50 IST|Sakshi

మంత్రి సబిత చెప్పారన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు 

పదోన్నతులకు ఏకాభిప్రాయమే ముఖ్యమనే భావన 

అంతా సవ్యంగా జరిగితే పదిరోజుల్లో షెడ్యూల్‌ 

సంఘాల భిన్నాభిప్రాయాలకు తెరదించేందుకు యత్నం 

రెండు రోజుల్లో విస్తృతస్థాయి భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ సంఘాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చిన తర్వాతే టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని యూనియన్లతో రెండు రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. సోమవారం తనను కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆమె ఇదే విషయాన్ని చెప్పారు. భిన్నాభిప్రాయాలపై చర్చించి, వివాదాలను పరిష్కరిద్దామని ఆమె పేర్కొన్నట్టు సంఘాల నేతలు వెల్లడించారు. అంతా ఒప్పుకుంటే 10 రోజుల్లో పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మంత్రి వెల్లడించినట్లు తెలిసింది. ఇప్పటికే 2 దఫాలుగా మంత్రి సమక్షంలో చర్చలు జరిగినా పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టులపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నవాదనలతో పట్టుబడుతున్నాయి. మరోవైపు కోర్టు సమస్యలూ పదోన్నతులకు అడ్డంకిగా ఉన్నాయి.  

ముందు షెడ్యూల్‌ ఇవ్వాలి 
పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) పట్టుబడుతోంది. ఇదే అభిప్రాయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో పనిచేస్తున్న 80 వేల మంది ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తక్షణమే షెడ్యూల్‌ ఇవ్వాలని, ఆ తర్వాత సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచించారు. పదోన్నతులు ఇవ్వకపోతే ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. 

అర్హత ప్రకారమే పదోన్నతులు 
ప్రభుత్వం నేరుగా నియమించిన ఉపాధ్యాయ సంఘం సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసింది. ఆ సంఘం అధ్యక్షుడు కాసం ప్రభాకర్‌ రావు, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్‌ అధ్యక్షుడు కె.దశరథ్‌ తదితరులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పర్యవేక్షణ పోస్టుల భర్తీపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని అర్హత, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకే ఇవ్వాలన్న అంశాన్ని మంత్రి ముందు ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మాతృ సంస్థల్లోనే పదోన్నతులు ఇవ్వాలని సూచించారు.

అధికారులతో మంత్రి సంప్రదింపులు 
రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఎస్జీటీలు, 2 వేలకు పైగా స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలి. అదేమాదిరి ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులను మంత్రి అడిగినట్టు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన తర్వాతే షెడ్యూల్‌ ఇవ్వాలని అధికారులు సూచించినట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు