Teachers' Day: తరగతి గది నుంచి చట్టసభల్లోకి..

5 Sep, 2022 12:03 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: వారంతా ఒకప్పటి గురువులు.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి వారి ఉన్నతికి తోడ్పడ్డారు. ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి, ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. సమాజ మార్గనిర్దేశకులుగా సేవలందించి విద్యార్థుల అభ్యన్నతికి పాటుపడ్డారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల ఆదరణను చూరగొని తరగతి నుంచి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల ఉన్నతికి ఏ విధంగా పాటుపడ్డారో ప్రజాప్రతినిధులుగానూ తమను గెలిపించిన ప్రజలకు అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా నాటి జ్ఞాపకాలు మరువలేనివని చెబుతున్న పూర్వపు గురువులపై ‘టీచర్స్‌డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.  

ఉద్యోగాన్ని వదిలి ఎమ్మెల్యే, ఎంపీగా.. 
ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు సైతం ఉపాధ్యా య వృత్తి నుంచే రాజకీయాల్లోకి అడుగుపె ట్టారు. 1987లో బోథ్‌ మండలం మహద్‌గాంవ్‌లో తొలిసారి ఐ టీడీఏ ఉపాధ్యాయుడిగా నియామకమయ్యారు. అదే మండలం రాజుపల్లి, బజార్‌హత్నూర్‌ మండలం కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ మండలం రాయిగూడ, ఆసిఫాబాద్‌ ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 1994 వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పారు.

రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో పోటీచేసి పరాజయం పాలై తిరిగి బీజేపీలో చేరి 2019లో ఎంపీగా గెలుపొందారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నాటి జ్ఞాపకాలు మరిచిపోలేనివని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని దాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. 

ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో.. 
ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు 1993లో ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా తిర్యాణి మండలం గొపెరాలో నియామకమయ్యారు. ఆరేళ్లపాటు అక్కడే పనిచేసిన ఆయన 1999లో నార్నూర్‌ మండలం చింతగూడ ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన 2004లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ అదె పార్టీ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తిరిగి 2018లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపాధ్యాయుడి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా ..
బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. 1986లో ఆదిలాబాద్‌ మండలం చింతగూడలో స్పెషల్‌ టీచర్‌గా నియామకమయ్యారు. 1987లో పదోన్నతి పొంది ముత్యన్‌పేట పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలలో నాలుగేళ్లపాటు పనిచేశారు. 1993లో గ్రేడ్‌–1 హింది పండిట్‌గా పదోన్నతి పొంది తలమడుగు మండలం ఝరి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఏడేళ్లపాటు పనిచేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.

2000 సంవత్సరంలో తాంసి మండలం అందర్‌బంద్‌కు బదిలీ అయ్యారు. అక్కడ మూడేళ్లపాటు పనిచేసి, ఆదిలాబాద్‌ మండలం మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలకు బదిలీ అయ్యారు. 2009 వరకు అక్కడే సేవలందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని కాంక్షిస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేసీఆర్‌ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గురువులు బావి తరాలకు ఆదర్శమని, బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

ప్రైవేట్‌ టీచర్‌ నుంచి ఎమ్మెల్యేగా 
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విద్యారంగంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన రాజకీయాల్లోకి రాక ముందు 1992నుంచి 1994 వరకు శ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువునందించి మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. 1996లో నెన్నెల మండల జెడ్పీటీసీగా, 2001లో ఎంపీపీగా పనిచేశారు. 2009, 2018లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ప్రజా ప్రతినిధి అయినప్పటికీ విద్యారంగపై ఆయనకున్న మక్కువను చాటుతూనే ఉంటారు. పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రతిభాపాఠవాలను తెలుసుకుంటారు. ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడుతూ వారితో మమేకమవుతారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, బాధ్యతగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

ఉపాధ్యాయుడి నుంచి క్యాబినెట్‌ మంత్రిగా
గోడం నగేశ్‌ 1986లో ఎస్జీబీటీగా బజార్‌హత్నూర్‌ మండలం విఠల్‌గూడ ఆశ్రమ పాఠశాలలో నియామకమయ్యారు. బోథ్‌ మండలం పార్డి–బి యూపీఎస్‌ హెచ్‌ఎంగాను సేవలందించారు. 1989లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బజార్‌హత్నూర్‌ మండలం జాతర్ల ఉన్నత పాఠశాలలో నియామకమయ్యారు. 1993లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చేరిన ఆయన 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లోనూ అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొంది పార్లమెంట్‌లోనూ అడుగుపెట్టారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఆయన జిల్లా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 

మరిన్ని వార్తలు