సెలవు పేరు.. ఏళ్లుగా గైర్హాజరు 

23 Jul, 2021 01:37 IST|Sakshi

పలు జిల్లాల్లో దీర్ఘకాలిక సెలవుల్లో ఉపాధ్యాయులు 

ముందు కొన్నాళ్లకే అనుమతి.. ఆపై ఇంకొంత కాలం సెలవుల్లో.. 

ఇంకొందరు టీచర్లు అనుమతే లేకుండా ఏళ్ల తరబడి గైర్హాజరు 

వివిధ కేసులతో విధులకు దూరంగా ఇంకొందరు ఉపాధ్యాయులు 

చర్యలకు సిద్ధమవుతున్న విద్యాశాఖ  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా వందలమంది టీచర్లు విధులకు గైర్హాజరవుతున్నారు. కొంతమంది టీచర్లు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని సెలవులు పెడితే, చాలామంది అనుమతి తీసుకోకుండానే విధులకు డుమ్మా కొడుతున్నారు. అధికారిక, అనధికారిక సెలవులు, డిప్యూటేషన్లతో ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో టీచర్లు విధులకు గైర్హాజరవుతుండగా.. అవినీతి, అక్రమాలు, ఇతరత్రా కేసులతో పలువురు విధులకు హాజరు కావట్లేదు. దీంతో వారు పనిచేయాల్సిన పాఠశాలల్లో సంబంధిత టీచర్లు లేక విద్యాబోధన దెబ్బతింటోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట మాత్రం విద్యాశాఖ ఇతర ప్రాంతాల నుంచి టీచర్లను తీసుకొని సర్దుబాటు చేసినా, మిగితా పాఠశాలల్లో సర్దుబాటుకు  ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో విధులకు గైర్హాజరవుతున్న టీచర్లపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. 

నోటీసులిచ్చి వదిలేస్తున్నారు.. 
రాష్ట్రంలో 2012 నుంచి విధులకు గైర్హాజరవుతున్న టీచర్లు ఉన్నారు. వారికి నోటీసులు జారీచేసి శాఖాపరమైన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమైనట్లు విద్యాశాఖ గుర్తించింది. కొన్ని జిల్లాల్లో నోటీసులు ఇచ్చి వదిలేస్తే మరికొన్ని జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో అనధికారిక సెలవుల్లో ఉన్న టీచర్లపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

నిబంధనలు ఏం చెబుతున్నాయి? 
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వుల (జీవో 128) ప్రకారం ఏడాదికన్నా ఎక్కువ కాలం ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారైనా విధులకు గైర్హాజరైతే సదరు ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే. సెలవుపెట్టినా, పెట్టకపోయినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం విధులకు హాజరు కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌ మంజూరు చేసిన కాలానికంటే ఎక్కువ కాలం ఉన్నా.. రాజీనామా చేసినట్లుగానే పరిగణించాలి. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన 56 మంది అధ్యాపకులను ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ 2011లో తొలగించింది. పాఠశాల విద్యాశాఖలో మాత్రం అలాంటి చర్యల్లేవు. తాజా పరిణామాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు.. గైర్హాజరు టీచర్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. 

కేసుల వివరాలు సేకరణ 
ఏయే జిల్లాల్లో ఎంతమంది టీచర్లపై కేసులున్నాయనేది విద్యాశాఖ సేకరిస్తోంది. ఎవరిపై ఎలాంటి కేసులున్నాయి,? ఎన్నాళ్లు సస్పెన్షన్‌లో ఉన్నారు?, ప్రస్తుత పరిస్థితి ఏంటి? అవినీతి, అక్రమాలు, ఇతరత్రా కేసుల కారణంగా ఎందరు టీచర్లు పాఠశాలలకు రావట్లేదన్న వివరాలు సేకరిస్తోంది. అలాంటి వారిపై ఇప్పటివరకు శాఖాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టారనేది జిల్లాల నుంచి సేకరిస్తోంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం వివిధ కేసుల్లో 700 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. 

వీరంతా ‘సెలవు’ల్లోనే.. 
► జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఒక టీచర్‌ 2016 ఆగస్టు నుంచి 2017 ఏప్రిల్‌ వరకు వి«ధులకు గైర్హాజరయ్యారు. ఆపై విధుల్లో చేరారు. తరువాత మళ్లీ 2020 ఆగస్టు నుంచి ఇప్పటివరకు అనధికారిక సెలవులోనే ఉన్నారు. 
► నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఒక టీచరైతే 2012 నుంచి విధులకు హాజరు కావట్లేదు. 2018 నుంచి మరికొందరు టీచర్లు విధులకు హాజరు కావట్లేదు. మొత్తంగా అక్కడ నలుగురు టీచర్లు అనధికారిక సెలవుల్లో ఉన్నట్లు సమాచారం.  
► పెద్దపల్లి జిల్లాలో ఒక టీచర్‌ 2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటికీ స్కూల్‌ మెట్లెక్కలేదు. ఇలాంటి టీచర్లు అక్కడ ముగ్గురు ఉన్నట్లు తేలింది.  కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి ఉంది. 
► సిద్దిపేటలో 8 మంది, జగిత్యాలలో ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో ముగ్గురు ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న జాబితాలో ఉన్నారు.   

మరిన్ని వార్తలు