మొట్ట మొదలు..ఆలుమగలు

29 Dec, 2021 03:44 IST|Sakshi

స్పౌజ్‌’ తేలాక స్కూళ్ల కేటాయింపు 

తొలుత భార్యాభర్తల ఆప్షన్లపై సర్కారు దృష్టి 

ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ ఉండబోదని స్పష్టీకరణ 

టీచర్ల సచివాలయం ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 

ముందస్తు నిర్బంధం..అరెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థ అమలు ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. జిల్లాల్లో టీచర్ల కౌన్సెలింగ్‌ను నిలిపివేసిన ప్రభుత్వం వారి ఆప్షన్లు పరిశీలించి స్కూళ్లు కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా భార్యాభర్తలు పెట్టుకున్న ఆప్షన్లపై (స్పౌజ్‌ కేసులు) దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన జాబితాను తక్షణమే పంపాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం రాత్రి అత్యవసర ఆదేశాలు పంపారు. ఈ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు.

భార్యాభర్తల ప్రాధాన్యతలపై ప్రధానంగా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే కొత్త జిల్లాల్లో టీచర్లకు స్కూళ్ళు కేటాయించే వీలుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే టీచర్లు ఆప్షన్లు ఇచ్చారని, వీటినే పరిగణనలోనికి తీసుకుంటామని అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఉండబోదని స్పష్టం చేశాయి. మరోవైపు మల్టీ జోనల్‌ కేటాయింపులపై అధికారులు సమీక్షించారు. నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే విద్యాశాఖ సరైన విధానంలో ప్రభుత్వానికి జాబితా పంపలేదని తెలిసింది. దీన్ని సవరించి తిరిగి పంపడంతో మల్టీ జోనల్‌ కేటాయింపుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.  

ముట్టడి విజయవంతం : యూఎస్పీసీ  
సెక్రటేరియట్‌ ముట్టడి విజయవంతమైందని యూ ఎస్పీసీ ప్రకటించింది. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వా నికి తెలిపామని స్పష్టం చేసింది. ముట్టడి కార్యక్రమానికి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నాయకులు కె జంగయ్య, చావ రవి (టీఎస్‌ యూటీఎఫ్‌), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్‌), ఎం రఘుశంకర్‌ రెడ్డి, టి లింగారెడ్డి (డీటీఎఫ్‌), యు.పోచయ్య (ఎస్టీఎఫ్‌), ఎన్‌.యాదగిరి (బీటీఎఫ్‌), ఎస్‌.హరికృష్ణ(టీటీఏ), బి.కొండయ్య, ఎస్‌.మహేష్‌ (ఎంఎస్టీఎఫ్‌), చింతా రమేష్‌ (ఎస్సీ ఎస్టీయూయస్‌), టి. విజయసాగర్‌ (టీజీపీఈటీఏ), వై.విజయకుమార్‌ (ఎస్సీఎస్టీ యూఎస్‌ టీఎస్‌) నాయకత్వం వహించారు. ప్రభుత్వ జీవో ఉపాధ్యాయులను సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లుగా మారుస్తోందని నేతలు విమర్శించారు. సాధారణ బదిలీల్లోనే శాశ్వత కేటాయిం పులు చేయాలని, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.   

ముట్టడిపై నిర్బంధం.. 
కేటాయింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఓ పక్క వేగం పెంచుతుండగానే.. మరోపక్క టీచర్లు ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. టీచర్లకు అన్యాయం చేసే 317 జీవో (స్థానికత)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీ (యూఎస్పీసీ) మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు రాజధానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ఉపాధ్యా య సంఘాల నేతలను జిల్లాల్లోనే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం అర్ధ రాత్రి నుంచే నిర్బంధం అమలు చేశారని సం ఘాల నేతలు తెలిపారు. పోలీసు నిర్బంధం మధ్యే ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యూహాత్మకంగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. వేర్వేరు మార్గాల్లో సెక్రటేరియట్‌కు చేరుకున్న సంఘాల నేతలు కొద్దిసేపు నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉంటే నేతల అరెస్టులను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోని పోలీసుస్టేషన్ల వద్ద ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు.

మరిన్ని వార్తలు