మాకూ బదిలీలు, పదోన్నతులు.... గురుకులాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్‌

23 Jan, 2023 02:02 IST|Sakshi

మంత్రులు, సొసైటీ కార్యదర్శులకు మూకుమ్మడి వినతులు 

సాధారణ బదిలీలు జరిగి ఐదేళ్లు కావస్తుండటంతో స్థాన చలనం కోసం యత్నాలు 

నాలుగు సొసైటీల పరిధిలో 20 వేల మంది ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌:  గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఇప్పుడు బదిలీలు, పదోన్నతుల మంత్రాన్ని జపిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో, తమ విషయంలో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని గురుకులాల సిబ్బంది కోరుతున్నారు. చివరగా 2018 సంవత్సరంలో ప్రభుత్వం సాధారణ బదిలీలను నిర్వహించింది.

ఈ ప్రక్రియ పూర్తయి ఐదేళ్లు కావస్తోంది. మరోవైపు నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా చాలామంది గురుకుల టీచర్లకు స్థానచలనం కలిగినప్పటికీ వారింకా పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. తాజాగా సాధారణ బదిలీలు నిర్వహిస్తే తమకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందనే భావన వారిలో ఉంది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థల పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో తాజాగా బదిలీలు నిర్వహిస్తే కోరిన చోట పోస్టింగ్‌ వస్తుందని వారు ఆశిస్తున్నారు. 

20వేల మందికి అవకాశం...! 
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలో దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యా సంస్థలున్నాయి.

వీటిల్లో 30 శాతం గురుకుల విద్యా సంస్థలు గత నాలుగేళ్లలో ఏర్పాటు చేసినవే. కొత్త గురుకులాల్లో మెజార్టీ టీచర్లు డిప్యుటేషన్‌ పద్ధతిలో కొనసాగుతుండగా, మరికొందరు కాంట్రాక్టు/తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా శాశ్వత ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. ఈ క్రమంలో గురుకులాల్లో బదిలీలు చేపడితే అర్హత ఉన్న టీచర్లకు ఎక్కువ ఆప్షన్లు వస్తాయని భావిస్తున్నారు.

ఈ మేరకు సంబంధిత మంత్రులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు గురుకుల ఉద్యోగ సంఘాలు వరుసగా వినతిపత్రాలు సమర్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో బదిలీల ప్రక్రియ చేపడితే దాదాపు 20 వేల మందికి అవకాశం దక్కుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.  

గ్రామీణ ప్రాంత ఉద్యోగులపై పని ఒత్తిడి 
కొత్త గురుకుల పాఠశాలల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ టీచర్ల మాదిరిగా గురుకులాల్లోనూ బదిలీలు నిర్వహించాలి. అర్హులందరికీ పదోన్నతులు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, పీఈటీలు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లకు కూడా పదోన్నతులు కల్పించాలి. 
– సీహెచ్‌ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం   

మరిన్ని వార్తలు