వేగం లేని యాప్‌... ఇప్పుడే ఇలాగైతే ఎలా? 

9 Jan, 2021 09:46 IST|Sakshi

ఒకచోట ఉండాల్సిన లబ్ధిదారుడి పేరు మరో చోట.. కొన్నిపేర్లు మాయం

కోవిన్‌ యాప్‌లో సమస్యల వెల్లువ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌లో అనేక సమస్యలు వెలుగుచూశాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,200 కేంద్రాల్లో నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. 917 కేంద్రాల్లో మాత్రమే డ్రైరన్‌ జరిగింది. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో మాత్రం ఆఫ్‌లైన్‌లో డ్రైరన్‌ నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో 917 చోట్ల 21,777 మంది లబ్ధిదారులు డ్రైరన్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్‌ టీకా డ్రైరన్‌ను స్వయంగా పరిశీలించడానికి డాక్టర్‌ శ్రీనివాసరావు పూర్వ వరంగల్‌ జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలను సందర్శించా రు. కరోనా టీకాల డ్రైరన్‌లో పలు సమస్యలు దృష్టికి వచ్చాయని తెలిపారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నట్లు పేర్కొన్నారు. ‘ముఖ్యంగా లబ్ధిదారుడి సమాచారా న్ని పొందుపర్చడంలో కోవిన్‌ యాప్‌ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. తప్పనిసరిగా పిన్‌ కోడ్‌తో లింక్‌ చేయాల నే నిబంధనతో సమస్య ఉత్పన్నమైంది.

ఒక పిన్‌ కోడ్‌ పరిధిలో ఎక్కువ సంఖ్యలో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో లబ్ధిదారుడికి కేటాయించిన కేంద్రంలో కాకుండా మరో కేంద్రంలో అతని పేరును సాఫ్ట్‌వేర్‌ కేటాయించి న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో ఒకచోట పొందాల్సిన వ్యాక్సిన్‌ కోసం మరో చోటుకి వెళ్లాల్సి వస్తుంది. కొం దరి పేర్లయితే పక్క జిల్లాల్లో ప్రత్యక్షమైనట్లు గుర్తించాం. కొందరు లబ్ధిదారుల పేర్లు అప్‌లోడ్‌ కాకపోవడంతో వారిపేర్లు ఏ కేంద్రంలోనూ కనిపించలేదు’ అని డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే ఒకేసారి డ్రైరన్‌ నిర్వహిం చడం వల్ల కోవిన్‌ సాఫ్ట్‌ వేర్‌లో వేగం తగ్గిందన్నారు. ఒక్కో లబ్ధిదారుడి సమాచారం పొందుపర్చడానికి గంటకు పైగా  పడుతుండటాన్ని కూడా డ్రైరన్‌లో గుర్తించినట్లు చెప్పారు. డ్రైరన్‌ కేంద్రాల సంఖ్య తగ్గినా లోటుపాట్లు బయపడిన ట్లు, తద్వారా వాటిని సరిదిద్దుకోవడానికి వీలు కలిగినట్లు ఆయన తెలిపారు.

డ్రైరన్‌ కేంద్రాల పరిశీలన..
ఎంజీఎం(వరంగల్‌): జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని యూపీహెచ్‌సీతోపాటు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి, లష్కర్‌సింగారం యూపీహెచ్‌సీ, కమలాపూర్‌ పీహెచ్‌సీలో శుక్రవారం జరిగిన డ్రైరన్‌ను డాక్టర్‌ శ్రీనివాసరావు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ హోటల్‌లో ఉమ్మడి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడో డ్రై రన్‌ను శుక్రవారం చేపట్టామని తెలిపారు. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో పిన్‌ కోడ్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఒక పీహెచ్‌సీ పరిధిలోని వారి పేర్లు మరో కేంద్రంలోకి వెళ్లాయని, ఇలాంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు , సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు కలిపి మొత్తం 2.90   లక్షల మంది వివరాలు కొవిప్‌ పోర్టల్‌లో నమోదు చేయగా, వారికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేస్తామని ఆయన తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో ఐదారు నెలల్లో అందరికీ వ్యాక్సిన్‌ వేయడం పూర్తవుతుందని డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు.  

>
మరిన్ని వార్తలు