TS Jobs 2022: తెలంగాణలో 2, 910 ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌.. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 ఇంకా..

31 Aug, 2022 08:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50 వేల మార్కు దాటింది. ఈ ఏడాది ఇప్పటివరకు 49,550 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, తాజాగా వివిధ శాఖల్లోని మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో భర్తీకి అనుమతి లభించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 52,460కి చేరింది. తాజాగా అనుమతి లభించిన వాటిలో గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులు కూడా ఉన్నాయి.

గ్రూప్‌–2 కింద 663, గ్రూప్‌– 3 కింద 1,373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లోని మరో 874 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్‌–2 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.145, గ్రూప్‌–3 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.146ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీ
గ్రూప్‌–2లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు (ఏఎస్‌వోలు), గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీవోలు, సబ్‌ రిజిస్ట్రార్లు, ఎక్సైజ్‌ ఎస్‌ఐ పోస్టులున్నాయి. గ్రూప్‌–3 కేటగిరీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్, జూలైతో పాటు ఆగస్టు నెలలో కూడా పలు దఫాలుగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా అనుమతి ఇచ్చిన పోస్టుల వివరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం రాత్రి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇదీ చదవండి: తెలంగాణ.. కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ కీ విడుదల.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు!

మరిన్ని వార్తలు