‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి

25 Dec, 2022 02:47 IST|Sakshi
బస్సులో ప్రయాణిస్తున్న మంత్రి పువ్వాడ,  ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌  

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ట్యాంక్‌బండ్‌పై జెండా ఊపి 50 కొత్త బస్సులు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణా­శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్‌ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు.

దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు.

ఇటీ­వల డీజిల్‌ సెస్‌ను మాత్రమే సవరించామని, టికెట్‌ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించిన­ప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలా­రం, ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్‌ ట్రాకింగ్‌ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్‌ బస్సుల­ను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా­మని చెప్పారు.

కార్యక్రమంలో రవాణా శాఖ కార్య­దర్శి శ్రీని­వాసరాజు, ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రవీందర్, రవాణాశాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వ­ర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్‌కుమార్, జీ­వన్‌ప్రసాద్, మోహన్‌(అశోక్‌ లేలాండ్‌), ఎంజీ ఆటో­మోటివ్స్‌ ఎండీ అనిల్‌ ఎం కామత్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు