ప్రభుత్వ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు

27 Apr, 2022 02:28 IST|Sakshi

2023–24 నాటికి సీట్లపెంపే లక్ష్యంగా కార్యాచరణ

పీజీ మెడికల్‌లో 2,500.. సూపర్‌ స్పెషాలిటీలో వెయ్యి సీట్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యకాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను భారీగా పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిం ది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సీట్ల కొరత ఉండటం.. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు చేసేలా వైద్య విద్య విస్తరణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టింది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఐదు ఉండగా, ఇప్పుడు 17 ఉన్నాయి.

ఈ సంవ త్సరంలో ఎనిమిది, 2023–24లో మరో ఎనిమిది కొత్త కాలేజీలు రానున్నాయి. సీట్ల విషయానికొస్తే.. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ కాలేజీల్లో 700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, 2022 నాటికి 2,840కి పెరిగాయి. వీటిని 2023–24 విద్యా సంవత్సరంకల్లా 5,240కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పీజీ మెడికల్‌ సీట్లు 2021 నాటికి 967 ఉండగా, వీటిని 2,500కు పెంచాలని నిర్ణయించింది. సూపర్‌స్పెషాలిటీ సీట్లు 2021 నాటికి 153 ఉండగా, వీటిని వెయ్యికి పెంచాలని నిర్దేశించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి.  

మరిన్ని వార్తలు