ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో 94% పోలింగ్‌

18 Oct, 2022 00:36 IST|Sakshi
గాంధీభవన్‌ మెట్లపై బైఠాయించిన దామోదర, పొన్నాల, శశిధర్‌రెడ్డి, ఓటు వేస్తున్న రేవంత్‌

గాంధీభవన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటేసిన ప్రతినిధులు 

ఓటర్ల పేర్లు తారుమారు చేశారని బైఠాయించిన దామోదర, పొన్నాల  

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 94 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 238 మంది ప్రతినిధులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండగా, సోమవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో 223 మంది ఓటేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వచ్చిన కేరళ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావెద్, రోహిత్‌ చౌదరి కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నా­రు.

దీంతో 241 మంది ఓటర్లకుగాను మొత్తం 226 మంది ఓటర్లు ఓటేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, నేతలు మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొ­మ్మూ­రి ప్రతాప్‌రెడ్డి, బెల్లయ్య నాయక్, మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు.

కర్ణాటక ఇన్‌చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు బళ్లారిలో ఓటేయగా, మరో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో ఓటేశారు. ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వెళ్లిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అక్కడే ఓటేశారు. లక్షదీప్‌ రిటర్నింగ్‌ అధికారిగా వెళ్లిన టీపీసీసీ ప్రధా­న కార్యదర్శి వేణుగోపాల్‌ అక్కడే ఓటేశారు.  

ఓట్లలో తేడాలొచ్చాయ్‌...: ఓటు హక్కు కల్పించినవారి జాబితాలో తేడాలొచ్చాయని పలువురు నేతలు ఆరోపించారు. టీపీసీసీ ప్రతినిధులుగా ఒకరిని ఎంపిక చేసి మరొకరికి ఓటు హక్కు కల్పించారంటూ పార్టీ సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్‌ మెట్లపై బైఠాయించారు. జనగామ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిల పేర్లు ఓటరు లిస్టులో లేవని రిటర్నింగ్‌ అధికారి వెనక్కి పంపడం తమకు అవమానకరమని వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఓటర్ల జాబితాలో తప్పులు వచ్చాయని, ఓటేసే వారిని చూస్తుంటే తనకే ఆశ్చర్యం కలుగుతోందని, ఈ ఓటరు జాబితాపై కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.  

రానివారు వీరే.... : టీపీసీసీ ప్రతినిధులు పొదెం వీరయ్య, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి, పల్లె కల్యాణి (ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు), కొలన్‌ హన్మంతరెడ్డి, రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, బోథ్‌ నియోజకవర్గానికి చెందిన మరో నేత ఓటింగ్‌కు హాజరు కాలేదు. మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ సోహైల్‌ స్థానంలో అజీముద్దీన్‌ అనే నాయకుడి పేరు ఓటరు జాబితాలో చేర్చగా, ఇద్దరూ ఓటింగ్‌కు రాలేదని, వివిధ కారణాలతో మరికొందరు గైర్హాజరయ్యారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు